ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియా 43 మంది రైతుల ఊచకోత ఘటన మరువకముందే జరిగిన మరో దారుణం తల్లిదండ్రులకు శోకాన్ని కలిగించింది. రైతులను హతమార్చిన బోకో హరామ్ ఉగ్రవాదులే మరో ఘాతుకానికి ఒడిగట్టారు. నైజీరియాలోని కంకారాలో ప్రభుత్వ సైన్స్ సెకండరీ పాఠశాలపై దాడి చేసిన సాయుధులు 300మందికి పైగా విద్యార్థులను అపహరించుకు పోయిన ఘటనలో చిన్నారుల ఆచూకీ ఇంకా లభించలేదు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహరీ సొంత రాష్ట్రంలో ఈ ఘటన జరగడం ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. తమ పిల్లలను కిడ్నాప్ చేసిన పాఠశాల ముందే తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. తమ చిన్నారులకు ఏమవుతుందో అనే ఆందోళనతో క్షణక్షణం భయాందోళనలకు గురవుతున్నారు. పిల్లలను కాపాడాలంటూ భద్రతా బలగాలను వేడుకుంటున్నారు.
"నేను మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. బందిపోట్లు కిడ్నాప్ చేసిన నా బిడ్డను చూడగలనా అని అనిపిస్తోంది. నా కుమారుడిని చూస్తాననే ఆశతో ఇక్కడే ఉన్నాను. కానీ ఇంతవరకూ నా కుమారుడిని చూడలేదు.నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది."
-అబ్దుల్ వజీజ్ ఉస్మాన్, కిడ్నాప్ అయిన బాలుడి తండ్రి
సిద్ధాంతాలు నచ్చేకే చేశాం...
విద్యార్థులను కిడ్నాప్ చేసిందే తామేనని బోకోహరమ్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు బోకోహరామ్ నాయకుడు అబూబకర్ షెకావ్ ఆడియో సందేశం విడుదల చేశాడు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నందునే పాఠశాలపై దాడి చేశామని తెలిపాడు. ఉగ్రవాదుల దాడి సమయంలో పాఠశాలలో సుమారు 600మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 300కిపైగా విద్యార్థులు అపహరణకు గురయ్యారని కట్సినా రాష్ట్ర గవర్నర్ అమీను మసారీ వెల్లడించారు.
దాడి జరుగుతున్నప్పుడు ముష్కరులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఆ సమయంలో చాలా మంది విద్యార్థులు పాఠశాల కంచెను తొలగించి పారిపోయి తమను తాము కాపాడుకున్నారని కట్సినా పోలీసు ప్రతినిధి గాంబో తెలిపారు. ఇటు చిన్నారులను రక్షించాలంటూ కంకారాలో ఆందోళన నిర్వహించగా యాష్ బ్రింగ్ బ్యాక్ అవర్ బాయ్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
సైన్యం ముమ్మర గాలింపు...
బోకోహరమ్ ఉగ్రమూక అపహరించుకుపోయిన విద్యార్థుల కోసం నైజీరియా ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. పోలీసులు, వైమానిక దళం, సైన్యం సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. జాంగో అటవీ ప్రాంతంలో ఉగ్రమూకల స్థావరాన్ని గుర్తించామని అక్కడ ముష్కరులకు, సైన్యానికి భీకర పోరు జరిగిందని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ప్రభుత్వ ప్రతినిధి గార్బా షెహు వెల్లడించారు.
ఇదేం మొదటి సారి కాదు..
నైజీరియాలో పాఠశాలలపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2014లో బాలికల వసతి గృహంపై దాడి చేసి 270 మందిని ఉగ్రమూకలు అపహరించగా అందులో 100 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. అదే ఏడాది ఓ కళాశాలపై జరిగిన దాడిలో 59 మంది విద్యార్థులు మరణించారు. నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్‌పై... అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఉగ్రదాడుల వల్ల 11 వందల మందికిపైగా మరణించారని వెల్లడించింది.