నైజీరియా ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై శుక్రవారం ఉదయం సాయుధులు దాడిచేసి 300 మంది విద్యార్థినులను అపహరించుకుపోయారు. జామ్‌ఫరా రాష్ట్రం జాంగేబ్‌లోని ప్రభుత్వ సెకెండరీ పాఠశాల వద్దకు తుపాకులతో మూకుమ్మడిగా వచ్చిన దుండగులు అక్కడే కొన్ని గంటల పాటు ఉన్నారు. తమ దురాగతానికి అడ్డు తగలకుండా ఉండేందుకు అంతకుముందు వారంతా సమీపంలోని ఓ సైనిక శిబిరం, చెక్‌పోస్టులపై కూడా దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు.
డబ్బు కోసం, జైలులో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జామ్‌ఫరా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అపహరణకు గురైన విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర గవర్నర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
గతంలోనూ..
కొద్ది రోజుల క్రితమే కంగారాలోని ఓ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు, టీచర్లు సహా 42 మందిని దుండగులు అపహరించగా వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. 2014 ఏప్రిల్‌లోనూ బోర్నో రాష్ట్రంలోని బిబోక్ సెకెండరీ స్కూల్ నుంచి బోకోహారమ్ తీవ్రవాదులు 276 మంది బాలికలను అపహరించుకుపోగా వారిలో దాదాపు 100 మంది ఏమయ్యారో ఇంతవరకు తెలియరాలేదు.
ఇదీ చూడండి: తల్లి చాకచక్యంతో మంటల్లోనుంచి బయటపడ్డ చిన్నారులు