1994లో మధ్య ఆఫ్రికా దేశమైన రువాండాలో జరిగిన మారణహోమానికి తమ దేశం పరోక్షంగా కారణమైందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ వ్యాఖ్యానించారు. దాదాపు 8,00,000 మంది మృతిచెందిన ఈ ఘటనను గుర్తుచేసుకున్న ఆయన రువాండాకు క్షమాపణ మాత్రం చెప్పలేదు.
రువాండా పర్యటనలో ఉన్న మేక్రాన్ ఆ దేశ అధ్యక్షుడు పాల్ కగామేను కలిశారు. అనంతరం కిగాలోని జెనోసైడ్ మెమోరియల్‌ను సందర్శించారు.
రువాండాలో జరిగిన మారణహోమానికి ఫ్రాన్స్ పరోక్షంగా కారణం అవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా దీనిపై మూడు నెలల తర్వాత స్పందించాయని పేర్కొన్నారు. ఫలితంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ స్వభావం కారణంగా ఇరు దేశాలు 27 సంవత్సరాల నుంచి పరస్పరం దూరంగా ఉన్నాయని మేక్రాన్ అన్నారు. 2017 నుంచి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మారణహోమం అనంతరం 2010లో రువాండాలో మొదటసారిగా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ పర్యటించారు. అనంతరం 11 ఏళ్ల తర్వాత మేక్రాన్ పర్యటించడం గమనార్హం.
రువాండా మారణహోమంలో హుతు వర్గాల వారు.. వేలాది మైనారిటీ తుట్సిస్ల మృత్యువుకి కారణమయ్యారు.
ఇదీ చదవండి:అమెరికా పర్యటనలో జైశంకర్ బిజీబిజీ