ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అల్జీరియా రాజధాని అల్జీర్స్ దద్దరిల్లింది. ప్రస్తుత అధ్యక్షుడు అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా వరుసగా ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పోలీసులు వారిని నిలువరించడం ఘర్షణలకు దారితీసింది. ఆందోళకారులను రాళ్లు రువ్వగా, పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ గొడవల్లో 56 మంది పోలీసులు, ఏడుగురు నిరసనకారులకు గాయాలయ్యాయి. 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్జీరియా అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్ 18న జరగనున్నాయి. తాను మరోమారు పోటీచేస్తున్నట్లు అబ్దెలాజిజ్ ప్రకటించారు. దేశంలో ఇటీవల పెరిగిపోయిన నిరుద్యోగం, పేదరికం అబ్దేలాజిజ్పై వ్యతిరేకతకు కారణమైంది.