ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ సుపరిచితమే. దాదాపు 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారాయన. శృంగార గీతాలతో ఒకప్పుడు సినీఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న తార.. సిల్క్ స్మిత. తన స్టెప్పులతో సినీ అభిమానులను ఉర్రూతలూగించిన స్మిత ఓ దశలో.. శివశంకర్ మాస్టర్‌తో కలిసి పనిచేయడానికి నిరాకరించిందట. బాలకృష్ణ నటించిన 'భలే తమ్ముడు' సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ కోసం.. శివశంకర్ మాస్టర్ చేస్తే చేయనని కరాఖండీగా చెప్పేసిందట. ఈ వ్యవహారంపై ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు శివశంకర్ మాస్టర్.
సిల్క్ స్మిత అంటే తనకు ఇప్పటికీ ఇష్టమేనని.. ఆమెనే తమను దూరంగా పెట్టిందని చెప్పుకొచ్చారు శివశంకర్. ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భలే తమ్ముడు సినిమా షూటింగ్ సమయంలో.. తమ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు.
''బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమా.. ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్టర్. నాలుగు పాటలు చేశాను. అన్నీ సూపర్‌గా వచ్చాయి. ఐదో పాట స్మితతో రీహార్సల్స్ చేశా. చేశాక ఇంటికొస్తుంటే కంపెనీ నుంచి ఫోనొచ్చింది. 'మాస్టర్గారూ.. మీకు, స్మితకు ఏం గొడవ? మీరుంటే చేయనంటోంది స్మిత.' అని చెప్పారు. 'ఇదేంటి.. నేనుంటే చేయననడం ఏంటీ తెలీదు నాకు అన్నాను.' 'ఆమె ఒకరిని రికమెండ్ చేస్తుందంట. సరోజ.' అని అనగానే.. మీరే డిసైడ్ చేయండని పెట్టేశాను. ప్రొడ్యూసర్ అర్జున్‌కు ఫోన్ చేస్తే.. 'ఆయన చిత్రబృందంతో.. మాస్టర్గారే కావాలి.. ఈ అమ్మాయి చేయకపోతే వేరేవాళ్లను పెట్టండి. బాలయ్య బాబును అడిగి.. రెండు రోజులు ఆలస్యమైనా పర్లేదు.. మాస్టర్‌గారు చెప్పినవాళ్లను తీసుకోండి.' అన్నారు. అప్పుడు స్మిత మీద నాకు జాలేసింది. జయమాలినిని పెట్టి ఆ సాంగ్ తీసేశా. హిట్టయింది. తర్వాత.. నేనే తప్పుకుంటే బాగుండేదనుకున్నా.''
- శివశంకర్ మాస్టర్
తన వస్త్రధారణపైనా స్పందించారు శివశంకర్ మాస్టర్. ఇలా సంప్రదాయంగా ఉండటమే ఇష్టమని ఆలీతో సరదాగా షోలో చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కూడా ఇదే ఇష్టమని అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేయడంపైనా మాట్లాడారు శివశంకర్ మాస్టర్. అసలు కృష్ణకు కోపమేరాదని చెప్పారు. రాధ అంటే, ఆమె డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని వివరించారు.
ఇవీ చూడండి: 'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత!