'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. కాగా, ఎవరినీ ఉద్దేశించి ఆయన ఆ పోస్ట్ పెట్టారో మాకు తెలుసంటూ కొందరు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
"ఇప్పటి వాళ్లు కేవలం ఫొటోల కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి స్థాయిని అందరితో తెలియజేసుకుంటున్నారు. ఇటీవల నాకు ఒక వీడియోగ్రాఫర్ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. ఏదో పెళ్లిలో ఫొటోగ్రాఫర్ రావడం ఆలస్యమవుతుందని తెలిసి పెళ్లి కూతురు సృహ తప్పి పడిపోయిందట. ఈ సంఘటన నిజంగా జరిగిందని చెప్పాడు" అంటూ వివేక్ అగ్ని హోత్రి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. 'మీరు చెబుతుంది నిజమే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అందులో తప్పులేదు. అలాంటి మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి' అని మరొక నెటిజెన్ కామెంట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిని ఉద్దేశించే ఆయన ఈ విధంగా మాట్లాడి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక తాజాగా వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనను బాలీవుడ్ పూర్తిగా దూరం పెట్టిందన్నారు. ప్రస్తుతం వస్తున్న హిందీ సినిమాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటున్నాయని అందుకే వాటిని ప్రేక్షకులు ఆదరించట్లేదని ఆయన అన్నారు. ఈ కారణంగానే బాలీవుడ్ చిత్రాలు పరాజయాలను చవిచూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. దీంతో అప్పటి నుంచి ప్రతి అంశంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
'కశ్మీర్ ఫైల్స్'పై స్టార్ యాక్టర్ ఫైర్!
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫి)లో 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ.. ''ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్ ఎప్పటికీ స్వాగతిస్తుంది. అందుకే నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతున్నా'' అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన 'వ్యక్తిగత అభిప్రాయం' అంటూ వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. మరోవైపు.. లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు.