టాలీవుడ్ సినీ ప్రేక్షకులందరూ మెచ్చే హీరో విక్టరీ వెంకటేశ్. అభిమానులు ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు. ఫ్యామిలీ హీరోగా తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన.. తాజాగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ 'సైంధవ్' చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో వెంకీ రక్తపు మరకలతో ఓ పెద్ద కంటైనర్ మీద పోరాడి అలిసిపోయి కూర్చొని కనిపించారు. కంటైనర్‌పై పేలుడు పదార్థాలు ఆయన చేతిలో మెషిన్ గన్ కూడా ఉంది. కోస్టల్ ఏరియాలో ఈ చిత్రం సాగుతుందని పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రేక్షకులు.. మరోసారి వెంకీని పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్లో చూడొచ్చని ఆనందపడుతున్నారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. వెంకటేష్ 75వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. 'హిట్', 'హిట్ 2' సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శైలేష్ కొలను.. వెంకటేశ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం రుహానీ శర్మ పేరు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా.. గ్లింప్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే రిలీజైన ఈ 'సైంధవ్' టైటిల్ గ్లింప్స్‌లోనూ వెంకీ.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో తన ఏజ్‌కి తగ్గట్లుగా స్టైలిష్‌గా కనిపించారు. ఈ గ్లింప్స్ చూసిన నెటిజన్లు.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా స్టైల్లో దర్శకుడు శైలేష్ కొలను ఏదో చేయబోతున్నారని తమ అభిప్రాయాల్ని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. బీజేఎం కూడా 'విక్రమ్' టెంప్లేట్‌ను గుర్తు చేస్తోందని అన్నారు.
ఇకపోతే ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ తన అన్న కొడుకు హీరో రానాతో కలిసి రీసెంట్గా రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వెంకటేశ్ నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇది. అయితే ఈ సిరీస్ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొనే సిరీస్‌లా లేకపోవడంతో.. ఆయన అభిమానులు నిరాశపడ్డారు. సిరీస్‌లో శ్రుతి మించిన బోల్డ్ కంటెంట్, అసభ్య పదజాలం ఉన్నడంతో దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఇదీ చూడండి: 'మహానటి' కీర్తి.. అప్పుడు సావిత్రిగా.. ఇప్పుడు వెన్నెలగా..