Director NSR Prasad Death : విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆయన.. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన మృతి పట్ట సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రసాద్.. సినిమాలపైన ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో రచయితగా పనిచేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు తన నిర్మాణ సంస్థలో దర్శకుడిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు. అలా, ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన 'నిరీక్షణ'తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఆ తర్వాత శ్రీకాంత్‌తో 'శత్రువు', నవదీప్‌తో 'నటుడు' లాంటి చిత్రాలనూ కూడా ఆయన తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన 'రెక్కీ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.