Jabardasth Sudheer Interview: "సినిమాని ఎంతలో తీశారు.. ఎంత మార్కెట్ అయ్యింది.. ఇలాంటి లెక్కలేవీ నాకు తెలియదు. నా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, కొన్న డిస్టిబ్యూటర్లు నష్టపోకూడదని కోరుకుంటా. అదే గొప్ప సంతృప్తి" అన్నారు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్' షోతో బుల్లితెర వేదికగా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు 'గాలోడు' చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుధీర్.
"ఇదేదో కొత్త తరహా చిత్రమని నేను చెప్పను కానీ.. ఇందులో మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకే ఈ సినిమా చేశా. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు కొన్ని సమస్యల్లో చిక్కుకొని సిటీకి వస్తాడు. అనుకోకుండా ఇక్కడ కూడా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. ఈ మధ్యలో ఓ ప్రేమకథ ఉంటుంది. మరి ఆ సమస్యలేంటి? వాటి మధ్య చిగురు తొడిగిన ప్రేమ కథేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి".
"ఈ చిత్రంలో నా పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది. ఆ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. అందుకే టైటిల్‌ను అలాగే ఖరారు చేశాం. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక చాలా ప్రశంసలొచ్చాయి. ఇన్నాళ్లకు హీరోగా ఓ మంచి సినిమా చేసినట్లుందని చాలా మంది అన్నారు. సంతోషంగా అనిపించింది. ఈ కథలో నాయికగా తొలుత రష్మీనే సంప్రదించారు. కానీ, డేట్స్ కుదర్లేదు".
"ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్ని రోజులు నవ్వుతూ.. నవ్విస్తూ ఉండాలని అనుకుంటా. అది వెండితెరైనా.. బుల్లితెరైనా పర్లేదు. హీరోగా కంటే మంచి ఎంటర్‌టైనర్ అని పిలిపించుకోవడంలోనే నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవాలనుకోవడం లేదు. సినిమాలూ చేస్తా.. షోలూ చేస్తా".
"జబర్దస్త్ షో నుంచి బయటకు రావడమన్నది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమే. నాకు కొన్ని అవసరాలున్నాయి.. ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటానని మల్లెమాల వాళ్లకు చెప్పా. సరే అన్నారు. ఇప్పుడు మళ్లీ తిరిగి షోలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నానని చెప్పా. ఓకే అన్నారు. ప్రస్తుతం నేను 'డార్లింగ్ సహస్ర' అనే సినిమా చేస్తున్నా. మరో చిత్రం చర్చల దశలో ఉంది".