Sharukh Khan Vadodara case : సాధారణ వ్యక్తుల తరహాలోనే సెలబ్రిటీలకూ అన్ని హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరొకరి తప్పులకు వారిని బాధ్యులుగా చేయలేమని వ్యాఖ్యానించింది. ఐదేళ్ల కిందట వడోదరా రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు విముక్తి కల్పిస్తూ గుజరాత్ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఇచ్చిన తీర్పును సుప్రీం సోమవారం సమర్థించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. 'రాయీస్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా షారుక్ ముంబయి నుంచి దిల్లీకి 2017 జనవరి 23న రైలులో ప్రయాణించారు.
ఆ ప్రయాణంలో ఉండగా వడోదరా స్టేషన్‌లో ఆయన టీషర్టులు, స్మైలీ బంతులను విసిరారని.. ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకొని పలువురు గాయపడ్డారని పిటిషన్ దాఖలైన సంగతి గమనార్హం. ఈ వ్యవహారంలో షారుక్‌పై కేసు నమోదు చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించారు. దానిపై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. తొక్కిసలాటకు సంబంధించి షారుక్ తప్పేమీ లేదని అభిప్రాయపడింది. రైలులో ప్రయాణిస్తున్న నటుడు స్టేషన్‌లో ఉన్న ప్రతిఒక్కరి భద్రతను ఎలా చూసుకోగలరని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును తాము సమర్థిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: Ponniyan Selvan: త్రిష ధరించిన నగల వెనక పెద్ద కథే ఉందిగా!