Sapta Sagaralu Dhaati Side B Telugu Review : చిత్రం : సప్త సాగరాలు దాటి - సైడ్ బి; నటీనటులు: రక్షిత్ శెట్టి, చైత్ర జె.ఆచార్, రుక్మిణీ వసంత్, అచ్యుత్ కుమార్, రమేశ్ ఇందిర, గోపాలకృష్ణ దేశపాండే తదితరులు; సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి; సంగీతం: చరణ్ రాజ్, నిర్మాణ సంస్థ: పరంవా స్టూడియోస్; విడుదల సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్; రచన-దర్శకత్వం: హేమంత్ ఎం రావు; ఎడిటింగ్: సునీల్ భరద్వాజ్; విడుదల తేదీ: 17-11-2023
గత కొన్ని రోజులుగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమాల్లో 'సప్తసాగరాలు దాటి సైడ్-బి' ఒకటి.' సైడ్ ఎ'కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. సైడ్-బి అంటూ ప్రేమజంట జీవితంలోని మరో అంకాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుందీ చిత్రం. కన్నడలో రూపొందిన 'సప్త సాగర్ దాచే ఎల్లో' చిత్రాలకి అనువాదంగా ఈ వరుస చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తొలి చిత్రం కన్నడలో సక్సెస్ అందుకోగా, తెలుగులోనూ మంచి ఆదరణనే సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ కొనసాగింపు చిత్రం ఎలా ఉంది? ప్రేమ సాగరాలను దాటిందా? లేదా అనేది అసలు కథ
కథేంటంటే : ప్రేమించుకుని.. ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించే ఓ జంట విధి ముందు ఓడిపోతుంది. ప్రియకు పెళ్లవుతుంది. మను 10 ఏళ్ల పాటు జైలులోనే గడపాల్సి వస్తుంది. ఇదంతా తొలి భాగం కథ. ఆ తర్వాత 2021లో మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి రావడం నుంచి రెండో భాగం కథ మొదలవుతుంది. బయటికి రాగానే ప్రియ (రుక్మిణీ వసంత్) అడ్రెస్ తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం సురభి (చైత్ర జె.ఆచార్) సాయం తీసుకుంటాడు. మరి అడ్రెస్ తెలుసుకుని ప్రియను మను కలిశాడా లేదా? పదేళ్ల తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇంతకీ సురభి ఎవరు? తను జైలులో మగ్గిపోవడానికి కారణమైన వాళ్లపై మను ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఇటువంటి విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: పార్ట్ 1కు దీటుగా హృద్యమైన భావోద్వేగాలతో పాటు.. ప్రతీకార కోణాన్నీ ఈ సినిమాలో డైరెక్టర్ తెరకెక్కించారు. దారులు వేరైపోయినప్పటికీ.. తాను ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం.. ఆనందం కోసం, ఆమె కన్న కలల కోసం పాటు పడే ఓ ప్రేమికుడి కథగా ఈ చిత్రం సాగుతుంది. అదే సమయంలో తాను అన్యాయంగా శిక్ష అనుభవించడానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు మను.
తొలి భాగం తరహాలోనే ఈ మూవీ నెమ్మదిగా సాగే సన్నివేశాలతో కాస్త ఇబ్బందికరం అనిపించిస్తుంది. కానీ అందులోని భావోద్వేగాలు మాత్రం ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయి. ప్రియ జీవితాన్ని దూరం నుంచి చూస్తూనే, ఆమె ప్రపంచాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నించే సన్నివేశాలు స్వచ్ఛమైన ప్రేమని చాటి చెప్పేలా కనిపిస్తాయి. మరోవైపు మను - సురభి జంట మధ్య జరిగే సన్నివేశాలు కూడా సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి.
ప్రియ భర్తతో కలిసి మను మద్యం తాగడం, అతన్ని కావాలనే గాయపరచడం లాంటి సన్నివేశాలు స్వచ్ఛమైన ప్రేమకథని పక్కదారి పట్టించినట్టు అనిపించినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ కథ గాడినపడుతుంది. మను జైలు నుంచి బయటికి రాగానే, తాను శిక్ష అనుభవించడానికి కారకులైన వారిపై దృష్టి పెట్టుంటే ఇదొక సాధారణ ప్రతీకార కథగా ఉండేది. కానీ, మను ప్రయాణం మళ్లీ ప్రియ చుట్టూనే సాగింది. దీంతో కథ కొంచం ఆసక్తికరంగా అనిపించింది.
ఆమె కోసం డబ్బు అవసరమైనప్పుడే ఈ కథ ప్రతీకార కోణంలోకి వెళ్లిపోతుంది. ఆ సీన్స్‌ను కూడా కవితాత్మకంగా తీర్చిదిద్దారు. సురభి ప్రయాణం, ఆమె నేపథ్యంలో కొన్ని సీన్స్ కూడా మనసుల్ని కదిలిస్తాయి. ప్రియ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడంతో ఆగిపోని ఈ కథ, ప్రియ పాట పాడాలంటూ ఆమె పాట కోసం ఎదురు చూడటం సన్నివేశాల్ని సాగదీసినట్టుగా అనిపిస్తుంది.
మరోవైపు సురభి పాత్రకి, కథానాయకుడి పాత్రకీ మంచి ముగింపునిచ్చారు. సముద్రం ఒకొక్కసారి ప్రశాంతంగా, మరొకసారి భీకరంగానూ కనిపించినట్టుగానే ఈ సినిమా కూడా ఉంటుంది. సైడ్-ఎ సముద్రంలోని ప్రశాంత కోణాన్ని ఆవిష్కరిస్తే, సైడ్-బి అలజడి కోణాన్ని చూపిస్తుంది. మొత్తంగా పాత్రలు, భావోద్వేగాలతో ప్రయాణం చేస్తే ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: పార్ట్ 1లో యువకుడిలా కనిపించిన రక్షిత్.. పార్ట్ 2లో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. పదేళ్ల తర్వాత మనిషి ఎలా మారతాడో అలాగే కనిపించారు. ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలిలో నటించారు. రుక్మిణీ వసంత్ కూడా లుక్ పరంగా చాలా వ్యత్యాసాన్ని చూపించారు. ఓ గృహిణిగా పాత్రకు తగ్గట్టుగా చక్కటి భావోద్వేగాలను పండించారు. చైత్ర నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నటనకి ప్రాధాన్యం ఉన్న ఆ పాత్రపై అంతే సాధికారత ప్రదర్శించింది. పొట్టకూటి కోసం పోరాటం చేసే ఓ యువతిగానూ, హృదయం ముక్కలైన వ్యక్తిగానూ తన నటనలో ఎంతో పరిణతి ప్రదర్శించారు.
ప్రకాశన్నగా గోపాలకృష్ణ దేశ్‌పాండే నటన అందరినీ నవ్విస్తుంది. ప్రియ జీవితంలోకి వెళ్లొద్దని మనుని వారించే సీన్స్, దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పే సన్నివేశాల్లోనూ గోపాలకృష్ణ దేశ్‌పాండే చక్కని హాస్యాన్ని పంచారు. రమేశ్ ఇందిర విలనిజం ప్రదర్శించిన తీరు బాగుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం, కళ విభాగాలు సినిమాకి ప్రాణం పోశాయి. దర్శకుడు హేమంత్ రావు ఓ హృద్యమైన ప్రేమగాథని...గాఢమైన భావోద్వేగాలతో తెరపైకి తీసుకు రావడంలో విజయవంతమయ్యారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + నటీ నటులు
- + హృద్యమైన భావోద్వేగాలు
- + కథలోని ప్రతీకార కోణం
- బలహీనతలు
- - నెమ్మదిగా సాగే సన్నివేశాలు
- చివరిగా: సప్త సాగరాలు దాటి సైడ్ బి... భావోద్వేగాల సాగరం.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">