RRR Oscar: ఆస్కార్స్ బరిలో 'ఆర్ఆర్ఆర్' నిలిచే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తమ విదేశీ సినిమా పురస్కారం అందుకునే అర్హత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాకు ఉందని భావించారంతా! అలా జరగలేదు. 'ఆర్ఆర్ఆర్'ను కాదని.. గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఆస్కార్‌కు భారతీయ అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నట్లు ప్రకటించింది. అది తెలిసి చాలా మంది నిరాశచెందారు. వాళ్ళకు, 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అందుకోవాలని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.
క్యాంపెయిన్ షురూ!
RRR For Oscars Campaign Started By Team : 'ఆర్ఆర్ఆర్' సినిమాను నేరుగా ఆస్కార్ నామినేషన్స్‌కు పంపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్ర బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగు పడింది. FYC (For Your Consideration) క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ.. కొన్ని థియేటర్లలో ఆడిన సినిమాలను ఆస్కార్స్‌కు కన్సిడర్ చేయడానికి పంపమని చెబుతోంది. అందులో భాగంగా ఈ క్యాంపెయిన్ మొదలైంది.
ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్, రామ్ చరణ్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగణ్), ఉత్తమ సహాయ నటి (ఆలియా భట్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఒరిజినల్ స్కోర్)తో పాటు సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా పదిహేను విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'ను కన్సిడర్ చేయాలంటూ క్యాంపెయిన్ మొదలైంది. ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.
రాజమౌళి కుమారుడి ట్వీట్!
'ఆర్ఆర్ఆర్' ఫర్ ఆస్కార్ క్యాంపెయిన్ స్టార్ట్ కావడంతో రాజమౌళి కుమారుడు చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ''ప్రేక్షకులందరి అంతులేని ప్రేమతో పాటు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు చెమట ధారపోసి, ప్రేమతో చేసిన పని మమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో ప్రేమను పొందడం ఒక కలలా ఉంది. మాకు అంతా మంచి జరగాలని కోరుకోండి. భవిష్యత్తులో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వేచి చూస్తున్నాం'' అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు.
ఎవరైతే చివరి వరకూ డ్యాన్స్ చేస్తారో?
'RRR For Oscars' క్యాంపెయిన్ మొదలైన నేపథ్యంలో హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ రుస్ ఫిషర్ ఒక ట్వీట్ చేశారు. 'బెస్ట్ పిక్చర్ నామినీలను స్టేజీ మీద నిలబెట్టి చివరి వరకు ఎవరైతే 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేస్తారో.. వాళ్లకు ఆస్కార్ ఇవ్వాలి' అంటూ ట్వీట్ చేశారు. ఆ ఐడియా నచ్చిందని కార్తికేయ సరదాగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా.. అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు.
ఇవీ చదవండి: విడాకులపై వెనక్కి తగ్గిన ధనుష్-ఐశ్వర్య!.. రజనీ 'పంచాయితీ' ఫలించిందా?
'ఆదిపురుష్'పై ట్రోలింగ్‌కు బ్రేక్ వేసేలా మూవీ టీమ్ స్పెషల్ ఆపరేషన్!