Titanic movie టైటానిక్.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది విషాద ఘటనే! మరోవైపు ప్రపంచమంతా మెచ్చుకున్న అద్భుతమైన వెండితెర ప్రేమకావ్యం. ఆ విషాద దుర్ఘటనకు ఓ అందమైన ప్రేమకథను జోడించి అందరీ హృదయాలను హత్తుకునేలా చేశారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 1997 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా అందరీ మనసుల్లో చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇద్దరు ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను ఉద్విగ్నభరితంగా చూపించారు జేమ్స్. ఈ చిత్రం సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు వారి నటన కూడా ప్రేక్షకుల్ని టైటానిక్ ప్రపంచంలో అంతే లీనమయ్యేలా చేసింది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరుతో విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా టైటానిక్ ప్రియులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సినిమాను రీమాస్టర్డ్ వెర్షన్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. రీమాస్టర్డ్ అంటే.. 3డీ, 4కే హెచ్డీఆర్, హై ఫ్రేమ్ రేట్ ఫార్మాట్లో మరింత క్వాలిటీగా దీన్ని విడుదల చేయడం. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల ముందుగానే ఫిబ్రవరి 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2012లో 3డీ ఫార్మాట్లో రిలీజ్ చేశారు.
కథేంటంటే... టాటానిక్ కథ ఇప్పటికీ ప్రతిఒక్కరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇందులో జాక్(లియోనార్డో) అనే పేదింటి కుర్రాడు ఉంటాడు. లాటరీలో రెండు టికెట్లు గెలుచుకుని టాటానిక్ షిప్లో థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకుంటాడు. స్నేహితుడితో కలిసి ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగుపెట్టిన అతడికి.. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న ఓ అందాల సుందరి రోజ్(కేట్ విన్స్లెట్) కంటపడుతుంది. ఇద్దరి మనసులు కలుస్తాయి. రోజ్కి కాబోయే భర్త దీన్ని గ్రహించి జాక్‌ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతడి కళ్లుగప్పి జాక్, రోజ్ ప్రేమయాణం నడుపుతారు. ఈ ప్రేమకథ సినీప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుంది. కానీ విధి విచిత్రమైనది. ఆ ఓడ ప్రయాణ మధ్యలో బలమైన మంచు కొండను ఢీ కొట్టుకుని మునిగిపోతుంది. ఈ క్రమంలోనే వీలైనంతమంది కాపాడటానికి సిబ్బంది ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో జాక్ మునిగిపోగా.. రోజ్ బ్రతికి ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ విషాదాంత ప్రేమకథ ప్రపంచం మొత్తం మీద బారీ వసూళ్లను సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. సుమారు 13వేల కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
అసలు కథ.. 1912లో సౌతంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా.. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ కథకే అద్భుతమైన ప్రేమకథను జోడించి సినిమాగా రూపొందించారు.
ఇదీ చూడండి: షారుక్ @30ఇయర్స్.. ఇంటెన్సివ్ లుక్‌లో బాద్షా.. స్టైల్ అదిరింది..