'నా దగ్గరకు వచ్చిన పాత్రల్లో నేను నటిస్తున్నాను తప్ప నాలో నటుడున్నాడనే సంగతి నాకు తెలియదు. నేను క్రియేటర్‌ని అయితే ఆ విషయం తెలిసేది' అని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తాను నటించిన వెబ్ సిరీస్ 'ముఖ్‌బిర్' త్వరలో విడుదలకానున్న నేపథ్యంలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 'మీలోని నటుణ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?' అనే ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
'నాలో నటుడు ఉన్నాడని నాకు తెలియదు' అని చెప్పారు. సమయపాలన గురించి మాట్లాడుతూ.. "బిజీగా ఉండే వ్యక్తులకే సమయం ఎక్కువగా ఉన్నట్టుంటుంది. ఎందుకంటే వారికి దాని విలువ తెలుసు. 24 గంటల సమయం సరిపోవట్లేదని చెబుతున్నారంటే సోమరితనం వల్లే. నేను అప్రమత్తంగా ఉంటా. అందుకే అన్ని విషయాలపై స్పందిస్తా. ప్రేక్షకులు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటా" అని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.
గూఢచార్యం నేపథ్యంలో తెరకెక్కిన 'ముఖ్‌బిర్'లో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్ నవంబరు 11న ఓటీటీ 'జీ 5'లో విడుదలకానుంది. శివమ్ నాయర్, జయ్‌ప్రద్ దేశాయ్ సంయుక్త దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. మరోవైపు, ప్రకాశ్‌రాజ్ తెలుగులో నటించిన 'రంగమార్తాండ', 'శాకుంతలం' తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇదీ చూడండి: 'సమంత ఇచ్చిన ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను'