Nithya menon marriage: "నా పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలో నిజం లేదు. అదంతా కల్పితం" అని నటి నిత్యా మేనన్ మరోసారి స్పష్టం చేశారు. తన వివాహ విషయమై ఇటీవలే వచ్చిన వదంతులపై స్పందించిన ఆమె ఇప్పుడు నేరుగా సోషల్మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. వివాహం గురించి ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన, ప్రణాళిక లేవని తెలిపారు. ఎవరో ఓ వ్యక్తి తాను ఊహించుకుని ఓ ఆర్టికల్ రాస్తే దాన్ని ఎలాంటి ఆధారాల్లేకుండా అంతా దాన్ని వ్యాప్తి చేశారన్నారు. అనంతరం, సినిమాల గురించి మాట్లాడుతూ.. రోబోలా మెకానికల్‌గా ఉండటం తనకు ఇష్టం ఉండదని, అందుకే అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్ ఇస్తుంటానని తెలిపారు. తాను నటించిన ఐదారు సినిమాలు త్వరలోనే విడుదలకాబోతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. గాయమైన తన చీలమండ ప్రస్తుతం బాగానే ఉందని, వాకింగ్ చేస్తున్నానని తెలిపారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నానన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను నిత్యా మేనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. నెట్టింట వైరల్ అయిన ఈ టాపిక్ గురించి ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రశ్న ఎదురవగా అవన్నీ అసత్యమని నిత్య అప్పుడే తెలిపారు. ఇప్పుడు నేరుగా ఇలా వీడియో షేర్ చేశారు. ఈ ఏడాది 'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నిత్య 19(1)(a) అనే సినిమాతో త్వరలోనే సందడి చేయనున్నారు. మరోవైపు, 'తిరుచిత్రంబళం' (తమిళం), 'ఆరామ్ తురికల్పన' (మలయాళం) తదితర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇదీ చూడండి: NBK 107: బాలయ్యతో సెల్ఫీ.. శ్రుతిహాసన్ ఫన్నీ ఎక్స్ప్రెషన్!