పొరుగు భాషల్లో విజయం ఇచ్చిన కథలతో మన హీరోలు సినిమాలు చేయడం.. అక్కడి దర్శకులతో మన కథానాయకులు చిత్రాలు తెరకెక్కించడం కొత్తేమీ కాదు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున నుంచి ఇప్పుడు యంగ్ హీరోల వరకు వేర భాష దర్శకులతో సినిమాలు తెరకెక్కించారు. అలా చిత్రాలు రూపొందాయి కూడా.ల ఇటీవలే పాన్ ఇండియా ట్రెండ్ కూడా తోడవడం వల్ల.. అక్కడి దర్శకులు ఇటు వస్తూ, ఇటు దర్శకులు అటు వెళుతూ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాగా ఎక్కువైంది.
కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత చాలా మంది దృష్టి.. కన్నడ ఇండస్ట్రీపై పడింది. కేజీఎఫ్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన డైరెక్టర్ ప్రశాంత్‌నీల్.. టాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలతో బిజీగా మారనున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న సలార్ మూవీ తర్వాత ఆయన హీరో ఎన్టీఆర్‌తో సినిమా తీయబోతున్నారట. అంతే కాకుండా మరో దర్శకుడు వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్‌తో సినిమా తీయనున్నారని సమచారం. అల్లు అర్జున్ - ప్రశాంత్ నీల్ కలయికలోనూ సినిమా ప్రచారంలో ఉంది. కన్నడ దర్శకుడు నర్తన్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే గోపీచంద్ కథానాయకుడిగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష నేతృత్వంలో ఓ సినిమా కూడా ఫిక్స్ అయింది.
అయితే తెలుగు దర్శకులు సైతం పొరుగు భాషల్లో తమ సత్తా చాటుతున్నారు. ఇటీవలే వంశీ పైడిపల్లి తమిళ స్టార్ విజయ్‌తో కలిసి వారసుడు తెరకెక్కించారు. వెంకీ అట్లూరి - తమిళ హీరో ధనుష్ కలయికలో రూపొందిన సార్ సినీ ప్రేక్షకుల్ని మెప్పించింది. హిందీలోనూ మనవాళ్ల హవా కొనసాగుతోంది. స్టార్ హీరో రణ్‌బీర్‌తో సందీప్ వంగా యానిమల్ తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా కథలే అటూ ఇటూ మారేవి. ఇప్పుడు కథలతోపాటు దర్శకులు కూడా మారుతున్నారు.
తమిళంలో విజయవంతమైన వినోదాయ సిద్ధం తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్, సాయితేజ్ కలిసి నటిస్తున్నారు. మాతృకని తెరకెక్కించిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. రచన మాత్రం త్రివిక్రమ్ చేశారు. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకునే రూపొందుతున్నాయి. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేయగా, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ చేస్తున్నారు. మరో అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ తమిళ స్టార్ దర్శకుడు శంకర్‌తో కలిసి సినిమా చేస్తున్నారు.