Haddi Movie : బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హడ్డీ'. ట్రాన్స్‌జెండర్స్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ట్రాన్స్‌జెండర్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సినిమాను సహజంగా చూపించేందుకు ప్రయత్నించిన దర్శక నిర్మాతలు అందులో భాగంగా పలు సీన్స్‌లో నటించేందుకు ఏకంగా 300 మంది నిజమైన ట్రాన్స్‌జెండర్‌లను తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలిపిన మూవీ టీమ్ అలా 300 మంది ట్రాన్స్‌జెండర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు తాము ఎంతో కష్టపడ్డామని తెలిపారు.
Haddi Movie 300 Transgenders : "ఈ ప్రక్రియ చాలా సాహసోపేతమైనది. అయితే ట్రాన్స్జెండర్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్న మాకు ఈ విషయం అంత కష్టంగా అనిపించలేదు. మేము వారి జీవితానుభవాల గురించి తెలుసుకుని వాటన్నింటినీ సినిమాలో చూపించాలని అనుకున్నాం. వారి నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం. మన ప్రపంచం అలాగే హిజ్రాల ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుకున్నాం. ముఖ్యంగా రేణుక అనే హిజ్రా ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసేందుకు మాకు ఎంతో సహాయపడ్డారు. అంతే కాకుండా తమ బాల్యం నుంచి రోజువారి జీవితంలో తాము అనుభవించిన కష్టాల గురించి ఆమె మాతో పంచుకున్నారు. ఇక తన తోటి స్నేహితురాలను నవాజుద్దీన్ వద్దకు తీసుకొచ్చారు. ఆయన కూడా వారందరితో ఎంతో సరదాగా ఉన్నారు. వారి వద్ద నుంచి ఆయన కూడా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. దీని ద్వారా ఆయన తన క్యారెక్టర్ గురించి బాగా అర్థం చేసుకున్నారని మేము భావించాం". అని నిర్మాత సంజయ్ సాహా తెలిపారు. ఇక ట్రాన్స్ జెండర్స్‌కు జరిగే ఆపరేషన్ గురించి రేణుక వారికి వివరించారని నిర్మాత తెలిపారు. ఆపరేషన్ తర్వాత వారు ఎలా ఉంటారో, వారి రోజువారి జీవన శైలి ఎలా ఉంటుందో రేణుక చెప్పారని సంజయ్ తెలిపారు. దీని ద్వారా 'హడ్డీ' సినిమాను రియలిస్టిక్‌గా తీసేందుకు దోహద పడిందని నిర్మాత అన్నారు.
Nawazuddin Haddi Look : ఇక సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఆయన ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలోని ట్రాన్స్‌జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించారు. గతంలోనే దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ లుక్ కోసం ఎంత సమయం పట్టిందో తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని పేర్కొంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.