'వినే టైమ్, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది' అనేది ఓ సినిమా డైలాగ్. 'మేజర్' చిత్ర ట్రైలర్ విడుదల వేడుకలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు బాలీవుడ్‌పై చేసిన ఓ వ్యాఖ్యకు అర్థం ఇలానే మారిపోయింది. బాలీవుడ్ ఎంట్రీ గురించి తాను ఒకలా అంటే కొందరు మరోలా అర్థం చేసుకున్నారు. దానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకేశ్ భట్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. "తనకు కావాల్సినంత సౌకర్యం బాలీవుడ్ ఇవ్వలేదనుకోవడం మంచిదే. అతడు ఎక్కడి నుంచో వచ్చాడో ఆ ప్రయాణాన్ని నేను గౌరవిస్తా. అతడెంతో ప్రతిభావంతుడు. ప్రేక్షకుల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. విజయవంతమైన కథానాయకుడాయన. ఒకవేళ తన అంచనాలను బాలీవుడ్ అందులేకపోతే, అందులో తప్పేమీ లేదు. అతనికి ఆల్ ది బెస్ట్" అని సదరు మీడియాకు ముకేశ్ వివరించారు.
ఇలా మొదలైంది.. 'మేజర్' నిర్మాతగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన మహేశ్‌కు బాలీవుడ్ ఎంట్రీపై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన శైలిలో సమాధానమిచ్చారాయన. బాలీవుడ్ తనని భరించలేదని, అందుకే తాను అక్కడికి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదని, టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దాంతో మహేశ్ చేసిన వ్యాఖ్యలను బీటౌన్ ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. వీటిపై మహేశ్ టీమ్ స్పందిస్తూ.. "మహేశ్‌కి అన్ని భాషలు, సినిమాపై అమితమైన గౌరవం ఉంది. ఆయనకు అన్ని భాషలూ సమానమే. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులోనే సినిమాలు చేయడం వల్ల మిగతా పరిశ్రమలతో పోలిస్తే తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఫీలవుతున్నానని మాత్రమే ఆయన చెప్పారు" అని పేర్కొంది.
ఇదీ చదవండి: మహేశ్‌బాబు వదిలేసుకున్న సూపర్‌హిట్ సినిమాలు ఇవే..!