Guntur Kaaram Review : సంక్రాంతి పండుగ - అందులోనూ స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 'గుంటూరు కారం' విషయంలోనూ అదే జరిగింది. చాలా కాలం తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేసిన చిత్రమిది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రమణగా మహేశ్ మాస్ అవతార్ మెప్పించిందా? తెలుసుకుందాం
Guntur Kaaram Story : కథేంటంటే : రాయల్ సత్యం (జయరామ్), వైరా వసుంధర (రమ్యకృష్ణ) కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్‌బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. అయితే వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణకు న్యాయ శాఖ మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్) రాజకీయ చక్రాన్ని తిప్పుతుంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావిస్తాడు. అందుకే వెంకటస్వామి - రమణతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకును ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. మరి తల్లిని ఎంతో ప్రేమించే రమణ, ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా? ఇంతకీ ఆ అగ్రీమెంట్‌లో ఏముంది? అసలు తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలి పెట్టాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే : త్రివిక్రమ్ మేజిక్(Guntur Kaaram Trivikram) ఏ దశలోనూ కనపడలేదు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. తెలిసిన కథల్నే కొత్తగా చెప్పడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ ఈసారి నిరాశపరిచారు. సంతకం చేస్తే తల్లి కొడుకుల బంధం తెగిపోతుందని తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన దర్శకుడు, ఆ తర్వాత సినిమాని కాలక్షేప సన్నివేశాలతో నడిపించేశాడు. చాలా పాత్రలకు, సన్నివేశాలకు కథతో అస్సలు సంబంధం ఉండదు. తల్లి - కొడుకు పాత్రల మధ్య ఉండాల్సిన సంఘర్షణపైన దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు.
ఫస్ట్ ఆఫ్ విషయానికొస్తే హీరో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల, వెన్నెల కిశోర్‌తో కలిసి హీరో చేసే హీరో చేసే హంగామా తప్ప మరేదీ కనపడదు. హీరోతో సంతకం కోసం మురళీశర్మ తన కూతురుని రంగంలోకి దించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.
సెకండాఫ్ విషయానికొస్తే ప్రకాశ్‌రాజ్ పాత్ర చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు అంతగా అర్థం కావు. పైగా కొడుకుతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ, వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా? ఇందులో సహజత్వం లోపించింది. మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మొత్తంగా మహేశ్‌బాబు మాస్ పాత్ర చేసే హంగామా, ఆయన ఎనర్జీ, మాస్ సాంగ్స్, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్, మరొకొన్ని ఎమోషన్స్ ఈ సినిమాకు బలం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎవరెలా చేశారంటే : మహేశ్‌బాబు నటనే ఈ సినిమాకి హైలైట్. వన్ మ్యాన్ షో. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా డ్యాన్స్ చేయలేదనే చెప్పాలి. ఎమోషన్స్‌ను బాగా క్యారీ చేశారు. శ్రీలీల మళ్లీ డ్యాన్స్‌కే పరిమితమైంది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో ఆమె, మహేశ్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్. మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా కనిపించింది. ఈశ్వరీరావు పాత్ర, ఆమె డైలాగులు కాస్త శ్రుతిమించినట్టు అనిపించాయి. ప్రకాశ్‌రాజ్, వెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనమేమీ లేదు. జగపతిబాబు, రావు రమేశ్, మురళీశర్మ, సునీల్ వంటి చాలా మంది నటులు కనిపిస్తారు కానీ, ఏ పాత్రలోనూ బలం లేదు. అయితే సాంకేతికంగా విభాగాలు లోటేమీ చేయలేదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది.
Guntur Kaaram Review : ఫైనల్‌గా మహేశ్ పాత్ర, నటన, పాటలు, శ్రీలీల(Guntur Kaaram Sreeleela) డ్యాన్సులు సినిమాకు బలం. కథ, కథనం, కొరవడిన భావోద్వేగాలు, రచనలో కనపడని త్రివిక్రమ్ మార్క్ బలహీనతలు చివరిగా గుంటూరు కారం ఘాటున్నా రుచి లేదు.