Mahesh Bollywood entry: బాలీవుడ్ ఎంట్రీ విషయంపై మరోసారి మాట్లాడారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. హిందీలో తాను నేరుగా ఎందుకు సినిమా చేయట్లేదో కారణాన్ని వివరించారు.
"ఇది గర్వంగా అనిపించొచ్చు. నాకు హిందీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్ నన్ను భరించలేదని భావిస్తున్నాను. నాకు వచ్చిన హిందీ చిత్రాల అవకాశాలను వినియోగించుకుంటూ సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు. తెలుగు చిత్రసీమలో నాకున్న స్టార్డమ్, ఇక్కడివారు చూపించే ప్రేమ వల్ల ఇతర ఇండస్ట్రీకి వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేయాలి, అవి భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని భావిస్తాను. నా బలం, ఎమోషన్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అనేదే ఓ భావోద్వేగం. భారతదేశంలోని ప్రజలందరూ తెలుగు చిత్రాలను చూడాలని నేనెప్పుడు కోరుకుంటాను. ప్రస్తుతం అది జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది." అని మహేశ్ అన్నారు.
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌బాబు ఇదే విషయమై మాట్లాడుతూ... "తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. భారతీయ సినీ ప్రియులంతా తెలుగు సినిమాలను చూస్తున్నప్పుడు నేను నేరుగా హిందీ చిత్రాల్లోనే నటించాల్సిన అవసరం లేదు" అని సమాధానమిచ్చారు.
మహేశ్ ప్రస్తుతం.. 'సర్కారువారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మహేశ్.. ఇప్పటివరకూ కనిపించని కొత్త లుక్‌లో అలరించనున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది. మరోవైపు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 'ఎస్‌ఎస్‌ఎంబీ' వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఇవి పూర్తయిన తర్వాత దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రం చేయనున్నారు.
ఇదీ చూడండి: నాన్న బయోపిక్ నేను చేయను: మహేశ్‌బాబు