KGF 2 Salar NTR 31 Prasanth Neel's Multiverse: యశ్ 'కేజీయఫ్2'కు ప్రభాస్ 'సలార్' సీక్వెలా? ఇది నిన్న మొన్నటి వరకు వినపడిన మాట ఇది. కానీ ఇప్పుడు.. 'సలార్'కు 'ఎన్టీఆర్ 31' సీక్వెలా? ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఇది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం, మీమ్స్ చూస్తే.. నిజమని నమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని తనతో చేయబోయే సినిమాకు సంబంధించి ఊరమాస్‌లుక్‌లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందులో తారక్ గుబురు గడ్డం.. కోర మీసంతో యాంగ్రీ లుక్‌లో కనిపించారు.
అయితే కొంత కాలం క్రితం 'సలార్' సినిమాలోని జగబతిబాబు లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆయన రాజమన్నార్ అనే ఓ విలక్షణ పాత్రని పోషిస్తున్నారని తెలిపారు. ఇందులో జగ్గు కూడా గుబురు గడ్డం.. కోర మీసంతో ఊరమాస్ లుక్‌లో కనిపించి భయపెట్టారు. ఇప్పుడు రెండు లుక్‌లను పోలుస్తూ.. రాజమన్నార్ కొడుకుగా తారక్.. 'ఎన్టీఆర్ 31'లో కనిపిస్తారని మాట్లాడుకుంటున్నారు.
ఇక 'కేజీయఫ్ 2'లో ఈశ్వరీ రావు కుమారుడి పేరు 'ఫర్మాన్'. అతడు హీరో దగ్గర సైన్యంలో పని చేస్తాడు. అధీరాను అడ్డుకోవడానికి ముందుకొచ్చిన యువకుడిగా అతడి పాత్రను చూపించారు. అయితే అందులో విలన్.. 'ఫర్మాన్'ను చంపినట్లు సరిగ్గా చూయించలేదు. దీంతో ఆ పాత్ర ఆధారంగానే 'సలార్' తీస్తున్నారా? అనే సందేహం కొందరికి కలుగుతోంది.
కాగా, ఇప్పటికే 'కేజీయఫ్', 'సలార్' నిర్మాతల్లో ఒకరైన విజయ్ కిరంగదూర్ మల్టీవర్స్ తరహాలో ఓ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'కేజీయఫ్ 2', 'సలార్', 'ఎన్టీఆర్ 31' సినిమాల మధ్య లింక్ పెట్టారని అనుకుంటున్నారు. అయితే 'ఎన్టీఆర్ 31'ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో 'సలార్' నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కాదు. మరి ఈ రెండు సినిమాల మధ్య లింక్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ మూడు చిత్రాల్లో కామన్ పాయింట్.. వీటి పోస్టర్లన్నీ బ్లాక్ థీమ్‌లో ఉండటమే. ఇది కూడా సీక్వెల్ అనడానికి ఓ కారణంగా భావిస్తున్నారు. ఇకపోతే 'కేజీయఫ్ 3'ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు హోంబలే ఫిల్మ్స్ మేకర్స్. ఏదేమైనప్పటికీ ఈ సినిమాలన్నింటికీ దర్శకుడు ఒక్కరే కావడం వల్ల ఈ ప్రచారం మరింత బలంగా కొనసాగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు లేదా సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి: ‘మార్వెల్ యూనివర్స్’ తరహాలో 'కేజీఎఫ్ 3'.. సరికొత్త లుక్‌లో సల్మాన్ భాయ్