తెలుగులో 'కాంతార' సినిమా ఊహించని రీతిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలు అవుతున్నా రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. తాజాగా మూడో వారంలో ఈ సినిమా థియేటర్ల సంఖ్య డబుల్ అవ్వడం టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తొలి వారంలో ఈ సినిమా 300 థియేటర్లలో రిలీజైంది. దీపావళి బరిలో నాలుగు సినిమాలు ఉండడం వల్ల రెండో వారంలో థియేటర్ల సంఖ్య 250కు తగ్గింది. కానీ దీపావళికి విడుదలైన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడం 'కాంతార'కు ప్లస్ అయినట్లుగా ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అనూహ్యంగా మూడో వారంలో థియేటర్ల సంఖ్య 550కు పెంచినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో ఈ సినిమా రూ.45 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.2 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో సినిమాను రిలీజ్ చేయగా పదింతలకుపైగా నిర్మాతలకు 'కాంతార' తెలుగు వెర్షన్ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.250 కోట్లకుపైగా వసూలు చేసింది.
కన్నడంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా 'కాంతార' నిలిచింది. తమ భూములను హస్తగతం చేసుకోవాలని భావించిన రాజవంశీయులతో పాటు అటవీ శాఖ అధికారులపై శివ అనే యువకుడు సాగించిన పోరాటాన్ని భక్తి, యాక్షన్ అంశాలతో ఎమోషనల్‌గా రిషబ్‌శెట్టి ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఆయన డైరెక్షన్ స్కిల్స్‌తో పాటు యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో సప్తమిగౌడ, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.