అల్లరి నరేశ్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లరినరేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..
'నాంది' మీ కెరీర్‌ను ఎలా టర్న్ చేసింది. ఆ సినిమా లేకపోతే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఉండేదా? లేదా?
నరేశ్: 'నాంది' నా కెరీర్‌కు ఎంతో ముఖ్యమైన చిత్రం. గతంలో నేను నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. నా కామెడీ బాగుందని, మంచి కలెక్షన్స్ వచ్చాయని అందరూ అనుకునేవారు. కానీ, 'నాంది' తర్వాత నేను ఒక సంపూర్ణమైన నటుడిగా పేరు తెచ్చుకున్నా. దాని వల్ల విభిన్నమైన కంటెంట్ ఉన్న కథలు నా వద్దకు వస్తున్నాయి.
ఈ సినిమా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువస్తుందా?
నరేశ్: తప్పకుండా. సమాజంలో జరుగుతున్నదే మేము ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా తర్వాత ప్రజల్లో ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. ఓటు వేసే జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలి. ప్రతి ఒక్కర్నీ ప్రశ్నించే చిత్రమిది.
నరేశ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?
నరేశ్: రాజకీయాలంటే నాకు ఆసక్తి లేని అంశం. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఉన్న రంగంలో వృద్ధి చెందితే చాలనే అనుకుంటా. పూర్తిస్థాయి నటుడిగా విజయం సాధించాలని, డైరెక్టర్ కావాలని ఆశ ఉంది. అంతేతప్ప రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నేనెంతో సున్నితమైన వ్యక్తిని. నాలాంటి వాళ్లు రాజకీయాలకు పనికిరారు.
హిందీలో వచ్చిన 'న్యూటన్' మూవీ దీనికి స్ఫూర్తి అనుకోవచ్చా?
మోహన్: 'న్యూటన్' విడుదల కావడానికి ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ కథ రాశా. 2009లో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు ఓ న్యూస్ పేపర్లో వచ్చిన చిన్న ఫొటో ఈ కథకు మూలం. అలియాబాద్ పక్కనే ఉన్న ఓ నదిలో ఒక తండ్రి తన కుమార్తెను పైకి ఎత్తుకుని నడుస్తూ ఆ ఫొటోలో కనిపించారు. ఆదివాసీ తండాలో నివసించే వాళ్లు ఆస్పత్రికి వెళ్లాలంటే ఎన్నో అవస్థలు పడాలని ఆ ఫొటో సారాంశం. దాన్ని చూసినప్పుడే.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చేయాలనిపించింది.
తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ మధ్య నటీనటులు ప్రమోషనల్ కార్యక్రమంలో దుస్తులపై సినిమా టైటిల్ ప్రింట్ చేయించుకుని వేసుకుంటున్నారు. మీరేమో 'గ్యాంగ్‌స్టర్' అని వేయించుకున్నారు. కారణం ఏమైనా ఉందా?
నరేశ్: కొత్త చొక్కా కొనుకున్నాను. బాగుందని వేసుకున్నాను. దీనికి, సినిమాకు ఏం సంబంధం లేదు.
కామెడీ సినిమాలకు మీరు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టారా?
నరేశ్: అలా ఏమీ లేదు. కథలు వింటున్నాను. 'నాంది' తర్వాత సీరియస్, కంటెంట్ ఉన్న కథలు నా వద్దకు వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉంటే కామెడీ సినిమా చేస్తా.
తమిళ దర్శకుడిని ఎంచుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
నరేశ్: కోలీవుడ్, మలయాళంలో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు చేస్తారని అందరూ అనుకుంటాం. మలయాళం సినిమాలు చూసినప్పుడు మనకెందుకు ఇలాంటి సినిమాలు రావడం లేదని అనుకుంటాం. కమర్షియల్‌గా ఇది ఆడుతుందా? ఆడదా? అనే సందేహం ఉంటుంది. కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రేక్షకులు కూడా విభిన్నంగా ఉండే చిత్రాలనే చూస్తున్నారు. 'నాంది' తర్వాత నటుడిగా నాకు గౌరవం పెరిగింది. మంచి కథలు చేయాలనుకున్నప్పుడే మోహన్‌గారు ఈ కథ చెప్పారు. కథ విన్న వెంటనే నేను ఓకే అన్నా.
తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు? ఈ సినిమాలో మీ రోల్?
ఆనంది: నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ కెరీర్ ఆరంభం నుంచి కోలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులోనూ మంచి సినిమాలు చేస్తున్నా. అందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా రోల్ ఆసక్తికరంగా ఉండనుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
వ్యవస్థలో మార్పు కోసం గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. మార్పు తెచ్చారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టారు. దానిని మీరెలా చూస్తారు?
నరేశ్: రాజకీయాలు నాకు ఏమాత్రం పరిచయం లేని విషయం. మంచి మార్పు కోసం ఎవరు పనిచేసినా.. మనం అభినందించాలి.
ఇదీ చూడండి: రణ్‌బీర్-అలియా కుమార్తె పేరు ఇదే.. ఎన్ని అర్థాలో