Godfather Director Mohan Raja: 'లూసిఫర్' లాంటి కథను ఇండియాలో కేవలం నలుగురైదుగురు నటులు మాత్రమే చేయగలరని, ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను తీసుకుని ఈ కథను తీర్చిదిద్దారని దర్శకుడు మోహన్ రాజా అన్నారు. చిరంజీవి కీలక పాత్రలో ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్' . దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో చిరంజీవి నుంచి చాలా మంచి సినిమాలు వస్తాయని, ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నారని అన్నారు.
"అన్ని కథలు రాసినట్లు 'లూసిఫర్ను' రాయలేం. ఇది ఒక నటుడి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ, స్క్రీన్‌ప్లే, సన్నివేశాలను రాసుకున్నారు. కేవలం లెజెండ్ స్టేటస్ ఉన్న నటుడు మాత్రమే ఇలాంటి కథను మోయగలడు. నాకు తెలిసి ఇండియాలో అలాంటి నటులు ముగ్గురో నలుగురో ఉన్నారంతే. వారిలో చిరంజీవిగారు ఒకరు. ఇది ఆయనకు కరెక్ట్ సబ్జెక్ట్." అని మోహన్ రాజా అన్నారు.
అనుకోకుండా 'గాడ్‌ఫాదర్' చేసే అవకాశం వచ్చినట్లు ఆయన తెలిపారు. ''ధృవ' దగ్గర నుంచి రామ్‌చరణ్‌తో నాకు పరిచయం ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్లం. తమిళంలో 'తనీఒరువన్-2' కథను సిద్ధం చేశా. మా ఫ్యామిలీ ఫ్రెండ్ తిరుపతి ప్రసాద్ ద్వారా ఈ విషయాన్ని చరణ్‌కు చెప్పేందుకు వచ్చా. ఆ సమయంలోనే 'లూసిఫర్' రీమేక్ దర్శకుడి కోసం వాళ్లు వెతుకుతున్నారు. అప్పటికి చిరంజీవి 'లూసిఫర్' చేస్తున్నారని నాకు తెలియదు. నా పని ముగించుకుని చెన్నై వెళ్లిపోయా. ఒకరోజు సడెన్‌గా రామ్‌చరణ్ నుంచి ఫోన్ వచ్చింది. 'రాజా.. తనీవరువన్-2 గురించి తర్వాత చూద్దాం. మీరు తెలుగులో లూసిఫర్ రీమేక్ చేస్తారా' అని అడిగారు. నేను అస్సలు ఊహించలేదు. అంతకుముందు ఒకసారి 'లూసిఫర్' చూశా. చరణ్ ఈ విషయాన్ని చెప్పగానే, చిరు సర్ కోసం మళ్లీ చూశా. నిజంగా ఆయనకు సరిపోయే కథ అనిపించింది. ఆ తర్వాత చిరంజీవిగారిని కలిసినప్పుడు కథలో చిన్న చిన్న మార్పులు చెప్పా. అది ఆయనకు నచ్చింది. 'చాలా మంది దర్శకులను అనుకున్నాం. అసలు మిమ్మల్ని ఎందుకు మర్చిపోయాను రాజా?' అని చిరు అనడం సంతోషంగా అనిపించింది" అని మోహన్ రాజా 'గాడ్‌ఫాదర్'కు తాను ఎలా డైరెక్టర్‌గా ఎంపికయ్యారో తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. తమన్‌సంగీతం అందించారు.
ఇవీ చదవండి: కార్తికేయ 3 ఫిక్స్, తెలియని కథలతో మరిన్ని చిత్రాలు చేస్తామన్న నిఖిల్
స్టార్ దర్శకుడికి షాక్, ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు