Chiranjeevi krishnavamsi: మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన బహుమతి వల్లే తాను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. దానివల్లే ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో తనకెదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకున్న ఆయన.. "నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఎంతో శ్రమించి ఆయన ఈ స్థాయికి వచ్చారు. తోటి నటీనటులు, ఇతర చిత్రబృందాన్ని ఆయనెప్పుడూ గౌరవిస్తారు. కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. అందుకే ఆయనంటే నాకు గౌరవం. వ్యక్తిగతంగానూ ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 'గోవిందుడు అందరివాడేలే'కు ఛాన్స్ ఇచ్చారు. గతంలో చిరుతో కలిసి నేనొక వాణిజ్య ప్రకటన చేశా. దాని డబ్బింగ్ సమయంలో.. 'అన్నయ్యా.. మీకు బాగా ఇష్టమైన వ్యక్తికి ఈ కారు గిఫ్ట్‌గా ఇచ్చేస్తారా?' అని చిరుని సరదాగా అడగ్గా.. 'కావాలా?' అన్నారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి పిలిచి మరీ.. 'ఈ కారు నీకే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా. అన్నయ్యా అని పిలుస్తున్నావ్. మరి, ఈ అన్నయ్య ఇస్తే తీసుకోవా?' అని అడిగారు. ఆయన మాట కాదనలేక దాన్ని తీసుకున్నా. దానితో ఎన్నో సాహసాలు చేశా. ఓసారి వ్యక్తిగత పనుల నిమిత్తం నందిగామ వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో నాకూ, డ్రైవర్‌కు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా నేను బయటపడ్డానంటే ఆ కారు వల్లే" అని కృష్ణవంశీ అన్నారు.
అనంతరం తన వైవాహికబంధం గురించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. "మొదటి నుంచి నాకు ఒంటరిగా జీవించడమే ఇష్టం. బాధ్యతలు, బంధాలకు దూరంగా ఉండాలనుకునే మనస్తత్వం నాది. అలాంటి నాకు రమ్యకృష్ణతో వివాహమైంది. పెళ్లి అనంతరం మా ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్లేవు. తన ఇష్టాలు, అభిరుచులను నేను గౌరవిస్తా. నా ఇష్టాలను తనూ గౌరవిస్తుంది. ఇక, మా ఇద్దరి మధ్య విభేదాలున్నాయంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. అలాంటి వార్తలు చూసి మేమిద్దరం నవ్వుకుంటాం. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రచారాలు జరగడం సాధారణమే.. వాటి గురించి పట్టించుకోవడం మానేస్తాం" అని ఆయన వివరణ ఇచ్చారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. 'నక్షత్రం' తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం 'రంగ మార్తాండ'. మరాఠీలో సూపర్‌హిట్ అందుకొన్న 'నటసామ్రాట్'కు ఇది రీమేక్. తల్లిదండ్రుల కథగా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి మెగాస్టార్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకప్పటి హాట్ హాట్ హీరోయిన్... ఇప్పుడిలా....!