Charmy Kaur Liger Movie : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో నిర్మాత ఛార్మి 'లైగర్' ఫలితంపై స్పందించారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే అదనంగా శ్రమించాల్సిందేనని అన్నారు. ఎందుకంటే ఈరోజుల్లో ఓటీటీలో వెరైటీ కంటెంట్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇది తప్పనిసరి అని చెప్పుకొచ్చారు.
"ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించలేకపోతే, వాళ్లెవరూ థియేటర్‌కు వచ్చి సినిమా చూడరు. ఎంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలనైనా కుటుంబం మొత్తం కూర్చొని కేవలం ఒక్క క్లిక్‌తో టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్‌లోనే లేదు. అన్ని చోట్లా ఉంది. ఆగస్టులో విడుదలైన 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ 2' చిత్రాల బడ్జెట్ మొత్తం రూ.150-170 కోట్లు. ఇవి మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. ఇక్కడ, అర్థంకాని విషయం ఏంటంటే, సినిమాల పట్ల అమితాసక్తి ఉన్న దక్షిణాది వాళ్లు కూడా మా సినిమాపై ఆసక్తి చూపలేదు. ఇది నిజంగా భయానక, విచారకరమైన పరిస్థితి" అని ఛార్మి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొవిడ్ కారణంగా 'లైగర్'వాయిదా పడుతూ వచ్చిందని, దీనివల్ల ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
"మేము 2020 జనవరిలో 'లైగర్' మొదటి షెడ్యూల్ ప్రారంభించాం. అంతకుముందే 2019లో కరణ్ జోహార్‌ను కలిశాం. 2022లో సినిమా విడుదలైంది. ఈ మూడేళ్లలో థియేటర్‌లో సినిమా విడుదల చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. కానీ, లాక్‌డౌన్, థర్డ్‌వేవ్, 50శాతం ఆక్యుపెన్సీ ఇలా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఇతర భారీ బడ్జెట్ చిత్రాలైన 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్' ముందుగా వచ్చే విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించాం. వేసవి వెళ్లిపోయింది. వర్షాలు మొదలయ్యాయి. అందుకే ఆగస్టు 25న విడుదల చేయాలనుకున్నాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు."అని ఛార్మి చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి: 'నా బుజ్జాయితో సరిగ్గా స్పెండ్ చేయలేకపోతున్నా.. ఆ సమయంలో నొప్పి భరిస్తూనే ఫీడింగ్ ఇచ్చా'