హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు చంద్ర మోహన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. నటుణ్నికావాలని తాను అనుకోలేదని, అనూహ్యంగానే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని తెలిపారు. ఎక్కువగా సంపాదించిన తెలుగు నటుల ప్రస్తావనరాగా.. ఆ విషయంలో చాలామంది తన పేరును చెబుతుంటారని, అందులో నిజం లేదని అన్నారు.
"అప్పట్లో హైదరాబాద్ నగరు శివారులో 35 ఎకరాల భూమిని కొన్నా. మద్రాసులో 15 ఎకరాల ల్యాండ్ ఉండేది. శోభన్ బాబు వద్దంటున్నా వినిపించుకోకుండా నేను దాన్ని అమ్మేశా. విక్రయించాల్సిన అవసరం లేకపోయినా అలా చేయడానికి కారణం మేనేజ్ చేసేందుకు ఎవరూ లేకపోవడమే. నాకు కొడుకులు లేరు, అల్లుళ్లు విదేశాల్లో ఉంటారు. నేను పోగొట్టుకొన్న ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం" అని చంద్ర మోహన్ అన్నారు.
ఫేక్‌న్యూస్ గురించి కూడా మాట్లాడారు. "బతికుండగానే చనిపోయినట్టు కొందరు వార్తలు రాస్తుంటారు. నా విషయంలోనూ అలా చేశారు. ఓసారి నేను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే.. అసత్య ప్రచారం జరిగింది. సినిమా వాళ్ల విషయంలోనే ఇలా ఎందుకు చేస్తారో అర్థంకాదు. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది" అని చంద్ర మోహన్ పేర్కొన్నారు.