Police Case on Dimple Hayathi : ఇటీవలే విడుదలైన గోపిచంద్ మూవీ 'రామబాణం' హీరోయిన్ నటి డింపుల్ హయాతిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారం విషయంలో ఈ కేసు నమోదైంది. డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే :
Dimple Hayathi criminal case : పోలీసుల సమాచారం మేరకు..హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో నటి డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. అయితే ట్రాఫిక్ డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనానికి డ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్.. ఆ వాహనాన్ని అపార్ట్మెంట్లోని సెల్లార్‌లో పార్కింగ్ చేస్తుంటారు. ఇక ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హయాతి, డేవిడ్‌లు కూడా తమ కారును పార్క్ చేస్తుంటారు.
అయితే ఆ ఇద్దరూ ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం లాంటి పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న కారు ముందు భాగం దెబ్బతిన్నది. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్.. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డింపుల్ హయాతి డేవిడ్‌లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హయాతి డేవిడ్‌లను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. నోటీసులు ఇచ్చి వారిని పంపించేశారు.
ఇక ఈ విషయంపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివరణ ఇచ్చారు. "డింపుల్ హయతి, నేను ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. సెల్లార్‌లో నా కారుకు అడ్డంగా ఆమె కారు పెడుతోంది. నేను అత్యవసరంగా వెళ్లేటప్పుడు కారు అడ్డుగా ఉండటం వల్ల నాకు ఇబ్బంది అవుతోంది. ఇదే విషయం గురించి వ్యక్తిగతంగా వెళ్లి డింపుల్ హయాతిని రిక్వెస్ట్ చేశాను. అయినా ఆమె తీరు మారలేదు. నా వాహనాన్ని ఢీ కొట్టి, నా కారును కాలుతో తన్నింది. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. దీంతో మా డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పి పుచ్చిన్నట్లు ట్వీట్ చేసింది. నాకు డింపుల్ కి వ్యక్తి గత గొడవలు ఏమి లేవు."
ఇక డింపుల్ హయాతి సినిమాల విషయానికి వస్తే.. 'గల్ఫ్' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన 'ఖిలాడీ'లో నటించిన ఈ భామ ఇటీవలే గోపీచంద్‌తో 'రామబాణం' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే ఈ భామకు మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.