Alitho saradaga Kota Srinivasarao Birthday: ప్రతినాయకుడిగా.. మధ్య తరగతి తండ్రిగా.. అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, హత్యలు చేసే గుండాగా.. కామెడీ విలన్‌గా.. ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కోట శ్రీనివాసరావు. సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి గొప్ప నటుడిగా తెలుగువారికి చేరువయ్యారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా ఆలితో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే నిర్మాత రామానాయుడుతో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
నిర్మాత రామానాయుడు చాలా సందర్భాల్లో 'కోటా గొప్ప నటుడు' అని చెప్పేవారు. మీ మధ్య ఏదైనా సరదా సంఘటన జరిగిందా? అని ఆలీ అడగగా.. ఇలా చెప్పుకొచ్చారు.
" 'అహ నా పెళ్లంట' సినిమా అప్పటికీ ప్రారంభంకాలేదు. ఓ రోజు నేను చెన్నై వెళ్లడానికి ఎయిర్పోర్ట్ వెళ్లా. అప్పటికే అక్కడ రామానాయుడు ఉన్నారు. ఆ రోజుల్లో ఆయనతో మాట్లాడమంటే పెద్ద గొప్ప. దూరంగా కూర్చొన్ని నమస్కారం చెప్పాను. అప్పుడు నన్ను 'ఇటు రావయ్యా' అన్నారు. పక్కకు వెళ్లి కూర్చున్నా. 'జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశాను. అందులో ఓ పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది. లేదంటే యావరేజ్ అవుతుంది. ఆ పాత్రను రావుగోపాల్రావుతో వేయిద్దాం అనుకున్నా. కానీ ఆయన నీ పేరు చెబుతున్నారు. 20 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇక నువ్వే వేషం వేయాలి. వేస్తున్నావు. 20 రోజులు డేట్స్ కావాలి' అన్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి రామానాయుడి స్టూడియోలోని ఓ ఫ్లోర్ ఓపెనింగ్ జరిగింది. ముఖ్యమంత్రి జనార్ధన్ రెడ్డి రిబ్బన్ కత్తిరించబోతున్నారు. అప్పుడు రామానాయుడు.. కార్యక్రమాన్ని కాస్త ఆపి.. నేనెక్కడున్నానంటూ పిలిచారు. దగ్గరికి వెళ్లాను. 'ఇక్కడే ఉండు. నువ్వు లేకుండా ఈ కార్యక్రమం ఎలా ?' అని అన్నారు. 'ఈ ఫ్లోర్ అతనిదే సార్' అని ముఖ్యమంత్రితో అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. అదేంటి అలా అన్నారు ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ.. 'అహ నా పెళ్లంట సినిమా వల్ల వచ్చిన డబ్బులతో ఈ ఫ్లోర్ కట్టించా. నువ్వు లేకపోతే ఆ చిత్రం అంత సక్కెస్ అయ్యేది కాదు' అన్నారు" అని కోట.. రామానాయుడుతో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
కాగా, రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన కోట శ్రీనివాసరావు 'ప్రేమఖరీదు'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. 'అహనా పెళ్ళంట!', 'ప్రతి ఘటన', 'యముడికి మొగుడు', 'ఖైదీ నం: 786', 'శివ', 'బొబ్బిలిరాజా', 'యమలీల', 'సంతోషం', 'బొమ్మరిల్లు', 'అతడు', 'రేసు గుర్రం' ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆరోగ్యంపై హీరో విక్రమ్ వీడియో మెసేజ్.. ఏమన్నారంటే..