Ali Tho Saradaga Vakkantham Vamsi: తెలుగుతెరపై స్క్రీన్ రైటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వక్కంతం వంశీ. ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించారు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగాను అదృష్టం పరీక్షించుకున్నారు. తాజాగా ఈ స్టార్ రైటర్ తన భార్య శ్రీవిద్యతో కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలబ్రెటీ టాక్ షోకు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో అల్లుఅర్జున్‌తో 'నాపేరు సూర్య' సినిమా చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించారు.
"దర్శకుడిగా సినిమా తెరకెక్కించాలని ఐదేళ్లుగా నేను సిద్ధమవుతున్నాను. చెప్పాలంటే 'నాపేరు సూర్య' సినిమా తారక్‌తో చేయాల్సింది. ఆయనే నన్ను డైరెక్టర్‌గా చేస్తానన్నారు. తన కోసమే కథ రాసుకున్నా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కాలి. కథ విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. అలా ఆ కథ పక్కన పెట్టా. ముందు ఏదో సినిమా ఒకటి చేద్దామని ఆ తర్వాత మళ్లీ రాశాను. అదే సమయంలో బన్నీ కోసం రేసుగుర్రం సినిమా కోసం స్టోరీ రాస్తున్నాను. అలా బన్నీతో పరిచయం ఉండడంతో నాపేరు సూర్య కథ ఆయనకు చెప్పా. వెంటనే ఆయన ఓకే చెప్పారు."
-- వక్కంతం వంశీ, దర్శకుడు
సురేంద్ర రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడిందని వ్యాఖ్యాత ఆలీ ప్రశ్నించారు. "సురేంద్ర రెడ్డితో నాకు పరిచయం ఎన్టీఆర్ వల్లే. అశోక్ సినిమా ద్వారా ఇద్దరం కలిశాం. అయితే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. ఫ్లాప్ అవ్వలేదు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి మహేశ్ బాబుతో అతిథి సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో నన్ను కూడా పిలిచారు. హెల్ప్ కోసం వెళ్లా. కానీ నేను తర్వాత అలా చేయొద్దనుకున్నా. అందుకు సురేంద్ర రెడ్డి ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇద్దరం కలిపి ఓ సినిమా చేసి హిట్ కొట్టాలని అన్నారు. అప్పుడే 'కిక్' సినిమా ఐడియా వచ్చి చెప్పా. ఆయన బ్రహ్మాండంగా తీశారు. సినిమాలో అన్ని క్యారెక్టర్లకు ఇప్పటికీ ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు జీవితంలో ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సినిమా 'కిక్'".
అయితే వంశీ రైటర్, డైరెక్టర్ గానే కాదు హీరోగా కూడా ఒక సినిమా చేశారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో యాంకర్ సుమ హీరోయిన్గా, వక్కంతం వంశీ హీరోగా 'కల్యాణ ప్రాప్తిరస్తు' అనే చిత్రం తెరకెక్కించిన విషయాన్ని ఆలీ గుర్తు చేశారు.