టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ భార్య రమ్య రఘుపతి బెంగళూరులో చేసిన వ్యాఖ్యలపై పవిత్రా లోకేశ్ స్పందించారు. రమ్య హైదరాబాద్ నుంచి వచ్చి బెంగుళూరులో ప్రెస్‌మీట్ పెట్టి తనపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏదైనా ఉంటే.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లో తేల్చుకోవాలి కానీ.. తనను బ్యాడ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'నరేశ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు నాకూ మధ్య ఎలాంటి దాపరికాలూ లేవు. రమ్యకి నరేశ్‌తో సమస్య ఉంటే హైదరాబాద్‌లో చూసుకోవాలి. కేవలం నేమ్, ఫేమ్ కోసం రమ్య మీడియా ముందుకు వస్తున్నారు. నాకు, నరేశ్‌కు మీ సపోర్ట్ కావాలి' అని పేర్కొన్నారు.
తన భార్య రమ్య రఘుపతి ఆరోపణలను సినీ నటుడు నరేశ్ ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ''రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదు. బెంగళూర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ నాపై వదంతులు సృష్టిస్తోంది. రూ.50 లక్షల కోసం నా ఇంట్లో వాళ్లను రమ్య పీడించింది. ఆమెకు విడాకుల నోటీసు పంపి నెల రోజులు దాటింది. విడాకుల నోటీసు పంపిన తర్వాత నాకు పెళ్లి కాబోతోందని రూమర్స్ క్రియేట్ చేసింది. కన్నడ మీడియాలో ఆ అంశంపై పూర్తి వివరణ ఇచ్చా. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరం. ఈ వివాదంలోకి పవిత్ర లోకేష్‌ను ప్రస్తావిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడం చాలా తప్పు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్‌లో నేను ఎంతోమంది హీరోయిన్స్‌తో కలిసి పనిచేశా. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నాకు గతంలో పెళ్లిళ్లు అయి ఉండొచ్చు. వాళ్లే నన్ను వదిలేసి వెళ్లిపోయారు. అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే నేను రాజకీయాలు, సామాజిక సేవలో ఎంతో బిజీ జీవితం గడిపా. రమ్య రఘుపతి నా జీవితాన్ని నాశనం చేశారు'' అని అన్నారు.
ఇంతకీ రమ్య ఏమన్నారంటే..
నరేశ్-పవిత్రా లోకేశ్‌ల గురించి ఇటీవల మీడియాలో వరుస వార్తలు వచ్చిన నేపథ్యంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి స్పందించారు. కర్ణాటకలో ఆమె మీడియాతో మాట్లాడారు. ''నరేశ్‌తో నాకు సత్సంబంధాలు లేవు. నాకు ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. మ్యారేజ్ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఆయనకు మ్యారేజ్ అయితే నా పరిస్థితి ఏంటి? తాజాగా ప్రెస్‌మీట్‌లోనే 'పవిత్ర నా భార్య' అని నరేశ్ అన్నారు. పవిత్రతో పెళ్లైంది కాబట్టే ఆయన అలా అన్నారు. నరేశ్ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మూడేళ్ల నుంచి మా మధ్య విభేదాలున్నాయి. న్యాయపరంగా విడాకులు తీసుకోవడమనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకు సమయం పడుతుంది. ఈ ఏడాది జనవరిలోనే నరేశ్ నాపై కేసు పెట్టారు. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా. నోటీసులు నా వరకు రాకుండా గేటు దగ్గర నుంచే వెనక్కి పంపారు. దేవుడి దయ వల్ల జూన్‌లో పోస్టు మాస్టర్ నా నంబర్‌కు కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు సమన్లు అన్నీ బెంగళూరు అడ్రస్‌కు పంపమని కోరా. నాకు పంపిన సమన్లపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. త్వరలో దీనిపై స్పందిస్తా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది'' అని రమ్య రఘుపతి అన్నారు.
ఇదీ చదవండి: మహేశ్‌ను ఫాలో అవుతున్న బిల్‌గేట్స్.. పీకే, సాయితేజ్ మూవీ షూటింగ్