తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసిన టాలీవుడ్ సీనియర్ నటి నిప్పాణి జమున గురించే ఈ పరిచయమంతా. నేడు ఆమె వయోభారంతో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె గురించి జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. అలానే ఆమె గతంలో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్ని చెప్పిన విశేషాలన్ని నెమరువేసుకుందాం. ఇందులో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, జయలలితో ఉన్న అనుబంధం, వారితో గొడవ వంటి విషయాలను గురించి కూడా మాట్లాడారు. ఆ సంగతులు..
ఇకపోతే జమున 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించారు. ఆమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిషుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి దగ్గరే గాత్ర సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. ఖిల్జీరాజుపతనం నాటకంలోని ఓ పాత్రకు సీనియర్ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. ఇదే సమయంలో మహానటి సావిత్రి కెరీర్ ప్రారంభంలో సినిమాలతో పాటు నాటకాల ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. దుగ్గిరాలలో ప్రదర్శన ఇచ్చే సమయంలో ఆమె జమున ఇంట్లోనే ఉన్నారట. అలా జమునతో పరిచయం కూడా ఏర్పడిందట. అప్పుడు సావిత్రినే.. జమునని సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారట. ఆమెను ప్రోత్సహించారట. అలా జమునకు సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తన 'మా భూమి నాటకం' చూసి డాక్టర్ గరికిపాటి రాజారావు జమునకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన పుట్టిల్లు సినిమా కోసం పనిచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆమె నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి సినీ ప్రియులను అలరించారు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో విభేధాలు.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట!