Actor Nassar injured in Shooting బహుభాషా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షాదరణ పొందిన సీనియర్ నటుడు నాజర్. ఇటు దక్షిణాది-అటు ఉత్తరాదిలోనూ హీరో, విలన్, కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా.. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే తాజాగా ఓ షూటింగ్లో పాల్గొన్న ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్పగాయాలయ్యాయి. నార్సింగ్ పీఎస్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమీ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళ సినిమాకు సంబంధించిన ఓటీటీ షూటింగ్‌ను ఇవాళ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించారు. సాయంత్రం 4గంల సమయంలో నాజర్ గాయపడ్డారు. దీంతో ఆయనకు రక్తస్రావం కావడం వల్ల.. వెంటనే అక్కడే ఉన్న షూటింగ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నాజర్ ఇంటికి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా, నాజర్.. నటనలోనే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్.. అడపాదడపా ప్లేబ్యాక్ సింగర్‌గానూ రాణించారు. ఆపై దర్శకుడు, నిర్మాతగానూ కెరీర్‌ను కొనసాగించారు. అయితే ఆయన త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ఇటీవలే టాక్ వినిపించింది. ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. లాక్డౌన్ సమయంలో ఆయన గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారని, అప్పుడు వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారట. దీంతో అప్పటినుంచి కుటుంబసభ్యులు సినిమాలకు దూరంగా ఉండి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేసి పర్మినెంట్‌గా ఇంటికే పరిమితమవ్వాలని సిద్ధమవుతున్నారని తెలిసింది.
1985లో 'కల్యాణ అగితీగల్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు నాజర్. ఆ తర్వాత 'నాయకన్' సినిమా వచ్చేవరకూ నాజర్ కెరీర్ నత్త నడక సాగింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేకుండా పోయింది. 'రోజా', 'తేవర్ మగన్', 'బొంబాయి', 'కురుతి పునల్'...లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కడానికి కారణమైనది. మొత్తంగా కెరీర్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు.
నాజర్ 1995లో దర్శకుడిగా అభిరుచి చాటుకున్నాడు. మన తరం మరిచిపోతున్న జానపద సంస్కృతి, కళారూపాల నేపథ్యంలో 'అవతారం' చిత్రానికి దర్శకత్వం చేశాడు. చిన్నతనంలో అతడు స్వయంగా వీక్షించిన జానపద కళారూపాలనే ఇతివృత్తంగా మలచి ఈ సినిమాని రూపొందించాడు. ఈ చిత్రంలో విలక్షణ నటి రేవతి నాజర్‌కి జతగా నటించి మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడమే కాకుండా... విమర్శకుల ఆదరణని అందుకుంది. ఆ తరువాత నాజర్ 1997లో 'దేవతార్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అనంతరం 'మాయన్', 'పాప్ కార్న్', 'సన్ సన్ తాతా' చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి: బాపు బొమ్మలా మలయాళీ అందం, ఎంత ముద్దుగున్నదో