కథానాయకులుగా తెరకు పరిచయమై ఆ స్థానాన్ని అలా నిలబెట్టుకుంటూ ఎదిగిన నటులు కొంతమందైతే.. చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టి కథానాయకుడిగా, స్టార్‌గా ఒక్కో మెట్టుని అధిరోహించినవాళ్లు కొంతమంది. కృష్ణంరాజు ప్రయాణం మూడో రకం. కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత పరాజయాల్ని ఎదుర్కొని, ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా ప్రయాణం సాగిస్తూ మళ్లీ హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఆయన సొంతం.
స్టూల్ ఎక్కించిన హీరో
సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన కృష్ణంరాజును అనుకోకుండా ఓ హోటల్‌లో 'అక్కా చెల్లెళ్లు' నిర్మాత పద్మనాభరావు చూసి 'మీకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా?' అని అడిగారు. కొన్నాళ్లకి ఆయనతో కలిసి మద్రాస్ వెళ్లి అక్కడ ప్రయత్నం ఫలించక వెనుదిరిగి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ పట్టుదలతో మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు కొత్తవాళ్లతో తీయాలనుకున్న 'తేనె మనసులు' చిత్రానికి మేకప్ టెస్ట్‌కి హాజరయ్యారు. అందులో కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని కూడా ఉన్నారు. కృష్ణ, సంధ్యారాణికి ఆ సినిమా అవకాశం ఖాయం కాగా... కృష్ణంరాజు, హేమమాలిని, జయలలిత వెనుదిరగాల్సి వచ్చింది.
తాను అవకాశం ఇస్తానని ప్రత్యగాత్మ మాట ఇవ్వడంతో ఆయన సూచించినట్టుగా కొన్ని నాటకాలు వేసి, అనుభవం సంపాదించారు. ఆ బ్యాచ్‌లో మిగతావాళ్ల కెరీర్‌లన్నీ అప్పటికీ ట్రాక్ ఎక్కగా, ప్రత్యగాత్మ దర్శకత్వంలో 'చిలకా గోరింక' సినిమాతో తెరంగేట్రం చేశారు కృష్ణంరాజు. తొలి సినిమాలోనే వందకి పైగా సినిమాలు చేసిన కృష్ణకుమారి సరసన నటించాల్సి వచ్చింది. పొడగరి అయిన ఆమె కృష్ణంరాజు పక్కన పొట్టిగా కనిపించారట. దాంతో ప్రేమ సన్నివేశాల్ని తెరకెక్కించేటప్పుడు స్టూల్ తీసుకొచ్చి వేశారట. నన్నే స్టూల్ ఎక్కించిన హీరో వచ్చాడని ఆమె సరదాగా అన్నారట. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు కృష్ణంరాజు. కొన్నాళ్లకి విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. పరిశ్రమని వదిలి వెనుదిరిగి పోవాలనుకున్న ఆయన ఎల్వీ ప్రసాద్‌తోపాటు పలువురు ప్రముఖుల సలహాతో విలన్ పాత్రల్ని భుజానికెత్తుకున్నారు. తన మిత్రుడు కృష్ణ కథానాయకుడిగా నటించిన 'నేనంటే నేనే' సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజుకి పేరొచ్చింది.
విలనిజంలో కొత్త ట్రెండ్
అప్పటివరకు తెరపై ప్రతినాయక పాత్రలు నాటకీయంగా కనిపించగా.. కృష్ణంరాజు తనదైన నటనతో వాటి పోకడల్ని మార్చారు. మూస పద్ధతిలో కాకుండా.. విలనిజం పాత్రల్లోనూ వైవిధ్యం కనిపించేలా డిజైన్ చేయమని దర్శకులకి సలహాలిచ్చేవారట. సమకాలీకులైన శోభన్‌బాబు, కృష్ణలకే కాకుండా.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకి కూడా దీటైన యువ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. 'మదర్ ఇండియా'కి రీమేక్‌గా తెరకెక్కిన 'బంగారు తల్లి'లో మాతృకలో సునీల్‌దత్ పోషించిన పాత్రని కృష్ణంరాజు తెలుగులో చేశారు. అమాయకుడిగా, ఆవేశపరుడిగా కనిపించే రంగ పాత్రలో తల్లికి బంగారు గాజులు తొడిగే సన్నివేశం చూస్తే ఎవ్వరైనా చప్పట్లు కొట్టాల్సిందే. 'వక్త్' రీమేక్‌గా రూపొందిన 'భలే అబ్బాయిలు' సినిమాతో హీరోయిజాన్ని మరిపించే విలనిజం ప్రదర్శించి విలక్షణ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. 'దొంగనూ నేనే... దొరనూ నేనే...' అంటూ స్టైలిష్ మేనరిజమ్‌తో అదరగొట్టారు. ఆ రోజుల్లో కృష్ణంరాజుని తెరపై విలన్‌గా చూసిన మహిళా ప్రేక్షకులు ఆయన పేరు చెప్పగానే భయపడేవారు.
దాదాపు 30 సినిమాల తర్వాత తనపై పడిన ఆ ముద్ర నుంచి బయట పడేందుకు ఆయన పలు సాత్వికమైన పాత్రల్ని పోషించాల్సి వచ్చింది. 'కృష్ణవేణి', 'అభిమానవంతులు', 'మేమూ మనుషులమే' తదితర చిత్రాలతో ప్రేక్షకులకి తన నటనలో మరో కోణాన్ని చూపించారు. హీరోగా నటించిన 'కృష్ణవేణి' ఘన విజయం సాధించింది. ఈ సినిమాతోనే సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ ప్రయాణం మొదలైంది. నిర్మాతగా, హీరోగా ఘన విజయాన్ని అందుకున్న కృష్ణంరాజు ఇక విలన్ పాత్రలకి స్వస్తి పలికారు. బయట సినిమాలు చేస్తూనే సొంత నిర్మాణ సంస్థలో 'భక్తకన్నప్ప'ని మొదలు పెట్టారు. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతగా వరుసగా విజయాల్ని అందుకున్న కృష్ణంరాజు. మూడో చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. అదే... 'అమరదీపం'. పోరాటాల్లేకుండా రూపొందిన ఆ సినిమా సంగీతం పరంగా, వాణిజ్య పరంగా ఘన విజయం అందుకుంది. 'రాజమహల్', 'హంతకులు దేవాంతకులు', 'మానవుడు దానవుడు', 'నీతి నిజాయతీ', 'వింత దంపతులు' తదితర చిత్రాల్లో కృష్ణంరాజు కొత్తదనాన్ని పంచారు.
రెబల్ ముద్ర ఇలా..
కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ తదితర చిత్రాలు కృష్ణంరాజుని రెబల్‌స్టార్‌గా మార్చేశాయి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'కటకటాల రుద్రయ్య' 1978లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మహాభారతంలో కర్ణుడి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణంరాజు కథ వినకుండా నటించిన ఒకే ఒక్క చిత్రమిది. కృష్ణంరాజుకి కొత్త ఇమేజ్‌ని తీసుకురావడంతో పాటు, దాసరి సినీ ప్రయాణాన్నికూడా మార్చింది. పలు భాషల్లో పునర్నితమైంది. కృష్ణంరాజు వందో చిత్రంగా, దాసరి దర్శకత్వంలోనే వచ్చిన 'రంగూన్ రౌడీ' కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. 'తల్లీకొడుకుల అనుబంధం', 'నిప్పుతో చెలగాటం', 'గోల్కొండ అబ్బులు', 'ప్రళయ రుద్రుడు', 'త్రిశూలం', 'పులిబెబ్బులి', 'ధర్మాత్ముడు', 'బొబ్బిలి బ్రహ్మన్న' తదితర చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు.
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే న్యాయం జరగాలనే కథాంశంతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'బొబ్బిలి బ్రహ్మన్న' తెరకెక్కింది. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. అప్పటివరకు పల్లెటూరి నేపథ్యంలోనూ, కుటుంబకథల్లోనూ నటిస్తూ వచ్చిన కృష్ణంరాజు చారిత్రక నేపథ్యంలో 'తాండ్ర పాపారాయుడు' చేశారు. దాసరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వ్యయం, తారాగణంతో రూపొందింది. చారిత్రాత్మకం, పౌరాణికం, జానపదం, సాంఘికం... ఇలా అన్ని నేపథ్యాలతో కూడిన సినిమాలు చేసిన కథానాయకుడిగా కృష్ణంరాజుకి గుర్తింపు ఉంది. 'శ్రీకృష్ణావతారం', 'కురుక్షేత్రం', 'వినాయక విజయం', 'విశ్వనాథ నాయకుడు', 'రుద్రమదేవి' తదితర చిత్రాలు కృష్ణంరాజు నట ప్రయాణంలోని వైవిధ్యతని చాటి చెబుతాయి. ఒక పక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క కీలక పాత్రల్లో మెరిశారు. 1993లో 'బావ బావమరిది', 1994లో 'జైలర్‌గారి అబ్బాయి' చిత్రాలతో తనలోని నటుడిని మరోసారి అద్భుతంగా ఆవిష్కరించారు. 'పల్నాటి పౌరుషం', 'నాయుడుగారి కుటుంబం' సినిమాలు చేసిన ఆయన సహనటుడిగా... 'మా నాన్నకి పెళ్లి', 'సుల్తాన్', 'వంశోధ్ధారకుడు', 'నీకు నేను నాకు నువ్వు', 'రామ్', 'రెబల్', 'ఎవడే సుబ్రహ్మణ్యం' తదితర చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కృష్ణంరాజు హిందీలోనూ ఓ సినిమా నిర్మించారు. అదే 'ధర్మాధికారి'. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు.
కబడ్డీ ముక్కు'రాజు'
కబడ్డీ అంటే కృష్ణంరాజుకు ఇష్టమైన ఆట. ఈ ఆటలో సాధారణంగా ప్రత్యర్థులు కాస్త దూకుడుగానే ఉంటారు. కూతకు వెళ్లినప్పుడు అవతలి జట్టు సభ్యుల్ని కుదిరితే గట్టిగానే కొడతారు. కానీ కృష్ణంరాజు మాత్రం చాలా నెమ్మదిగా వ్యవహరించేవారట. ప్రత్యర్థిని ఔట్ చేయాల్సి వచ్చినప్పుడు ముక్కుమీద వేలుతో తాకి వచ్చేవారట. దీంతో ఔట్ అయిన విషయం అంపైర్‌కు కూడా తెలియని సందర్భాలు ఉండేవట. స్నేహితులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కృష్ణంరాజు అదే రీతిలో ఆడుతుండటంతో చివరకు 'ముక్కురాజు' బిరుదు తగిలించారు.
అర్ధాంగితో అనుబంధం
''నా మొదటి భార్యను కోల్పోవడం నా జీవితంలో అత్యంత విషాద సంఘటన. ఆ తర్వాత శ్యామల నా జీవితంలోకి అడుగుపెట్టి అన్నీ తానైంది. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లతో పాటు నన్నూ ఓ పిల్లాడిలా భావించి నాకేం కావాలో చూసుకుంటుంది'' అంటూ తన అర్ధాంగి గురించి గొప్పగా చెప్పేవారు కృష్ణంరాజు. కృష్ణంరాజు కుమార్తె ప్రసీద 'రాధేశ్యామ్'తో నిర్మాతగా పరిచయం అయ్యారు. రెండో కుమార్తె ప్రకీర్తి సినీ ప్రొడక్షన్ డిజైన్ రంగంలో పనిచేస్తున్నారు.
అతిథి మర్యాదలకు పెట్టింది పేరు
వెండితెరపై గంభీరమైన పాత్రల్లో కనిపిస్తూ.. రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. కానీ, నిజ జీవితంలో ఆయన మనసు వెన్న. స్నేహానికి పెట్టింది పేరు. ఇక అతిథి మర్యాదల్లో ఆయనకు ఆయనే సాటి. స్వతహాగా మంచి భోజన ప్రియుడైన ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఆ సెట్‌లో ఉన్న వాళ్లందరికీ తన ఇంటి నుంచే భోజనం తీసుకెళ్లేవారు. కేవలం తీసుకెళ్లడమే కాదు.. 'ఇక వద్దు సర్.. చాలు' అన్నా వినేవారు కాదట. ప్రతి ఒక్కరూ కడుపునిండా తినే వరకు ఊరుకునే వారు కాదు. అందుకే ఆయన్ని ఇండస్ట్రీలో ఎంతో మంది 'మర్యాద రామన్న' అని కీర్తించేవారు. ఇప్పుడిదే ఆనవాయితీని హీరో ప్రభాస్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ ఆతిథ్యం గురించి బాలీవుడ్ వర్గాలు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి. కృష్ణంరాజుకు మాంసాహారం, పెసరట్టు అంటే చాలా ఇష్టం.
శివ శివ శంకర భక్తవ శంకర...
'భక్త కన్నప్ప' చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ మార్మోగుతుంది. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్ని మనం కృష్ణంరాజు చిత్రాల నుంచి వినొచ్చు. తెలుగు దిగ్గజ సంగీత దర్శకులు, గాయకులందరితో కలిసి పని చేశారు కృష్ణంరాజు. ఆయన నటించిన సినిమాల్లో జనం నోళ్లలో బాగా నానిన వాటిలో కొన్ని..
- రాయిని ఆడది చేసిన రాముడివా.. గంగను తలపై మోసిన శివుడివా?.. - త్రిశూలం
- ఆకాశం దించాలా నెలవంక తుంచాలా.. - భక్త కన్నప్ప
- పరిమళించు పున్నమిలో.. ప్రణయవీణ పలికింది- పులి బెబ్బులి
- అభినందన మందార మాల... అధినాయక స్వాగత వేళ- తాండ్ర పాపారాయుడు
- పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు- త్రిశూలం
- కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని.. - జీవన తరంగాలు
కొండగాలి.. వెండివాన
దాదాపు పాతిక సినిమాల తర్వాత హీరోగా 'ఇంటిదొంగలు' సినిమాలో నటించే అవకాశం కృష్ణంరాజుకి వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ ఊటీలో జరుగుతోంది. కొండమీద వెండివాన.. అంటూ సాగే పాటని చిత్రీకరిస్తున్నారు. ఆ పాటకి ప్రముఖ నృత్య దర్శకుడు తంగప్ప నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఆయన అసిస్టెంట్ ఒకరు డ్యాన్స్ చూపిస్తే ఆ ప్రకారం కృష్ణంరాజు ఆడిపాడాలి. ఆ అసిస్టెంటేమో చాలా వేగంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ వేగాన్ని కృష్ణంరాజు అందుకోలేకపోతున్నారు.
వేగం తగ్గించు అంటే 'అలాగే అన్నగారూ..' అనేవాడట. డ్యాన్స్‌తోపాటు, ఇంకా చాలా విద్యలున్న ఆ కుర్రాడిని చూసి ముచ్చటపడి 'నువ్వు ఎప్పటికైనా చాలా పెద్దవాడివి అవుతావురా' అనేవారట. అన్నట్టుగా అయిదారేళ్లకే ఆ అసిస్టెంట్ పెద్ద హీరోగా ఎదిగాడు. ఆ అసిస్టెంట్ ఎవరో కాదు..నేటి అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్. ఇప్పటికీ ఎక్కడైనా ఎదురైతే 'అన్నగారూ.. కొండగాలి వెండివాన..' అంటూ ప్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేస్తుంటాడు కమల్‌హాసన్ అంటూ కృష్ణంరాజు ఆ జ్ఞాపకాల్ని పంచుకునేవారు.
యోగాలో పీహెచ్‌డీ కుదర్లేదు
కృష్ణంరాజుకు యోగా అంటే ప్రత్యేక అభిమానం. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో ఎనిమిదేళ్ల నుంచే యోగాసనాలు నేర్చుకునేవారట. ఓ సందర్భంలో యోగా గురించి కృష్ణంరాజు గుర్తు చేసుకుంటూ ''డిగ్రీలో యోగా మీద ఎన్నో పుస్తకాలు చదివాను. దాని మీద మమకారం ఏ స్థాయికి వెళ్లిందంటే పతంజలి యోగ శాస్త్రాన్ని మధించి పీహెచ్‌డీ తీసుకోవాలనుకున్నాను. కానీ వీలు కాలేదు''అని చెప్పారు.
తెర పంచుకోవడంలో ఎప్పుడూ ముందడుగే
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తన తోటి అగ్ర తారలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు వంటి వారితోనూ తెర పంచుకొని.. సినీప్రియుల్ని మురిపించారు కృష్ణంరాజు.
'దేవదాసు' ఎన్నిసార్లు చూశానో..
కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో ఏయన్నార్ ఒకరు. ఆయన నటించిన 'దేవదాసు' చిత్రమంటే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం. ఇక అక్కినేనితో కృష్ణంరాజు కలిసి నటించిన తొలి సినిమా 1969లో వచ్చిన 'బుద్ధిమంతుడు'. అనంతరం వీరి కలయికలో 'జై జవాన్', 'పవిత్ర బంధం', 'రైతు కుటుంబం', 'మంచి రోజులు వచ్చాయి', 'కన్నకొడుకు', 'యస్.పి.భయంకర్' చిత్రాలొచ్చాయి.
కృష్ణతో కలిసి అత్యధిక చిత్రాలు
కృష్ణ.. కృష్ణంరాజుల సినీ కెరీర్‌లు ఇంచుమించు ఒకే సమయంలో మొదలయ్యాయి. అలాంటి ఈ ఇద్దరు తారలు కలిసి తెరపై దాదాపు 17కి పైగా చిత్రాల్లో పోటాపోటీగా నటించి, మురిపించారు. కృష్ణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘నేనంటే నేనే’ (1968). ఇలా ఈ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం ‘హంతకులు - దేవాంతకులు’, ‘ఇల్లు ఇల్లాలు’, ‘మాయదారి మల్లిగాడు’, ‘కురుక్షేత్రం’, ‘అడవి సింహాలు’, ‘యుద్ధం’, ‘విశ్వనాథనాయకుడు’, ‘మనుషలు చేసిన దొంగలు’ ‘ఇంద్రభవనం’, ‘సుల్తాన్’ తదితర సినిమాలతోనూ కొనసాగింది.
శోభన్‌బాబుతో స్నేహం.. ఎంతో ప్రత్యేకం
ఇండస్ట్రీలో హీరోగా నిలబడే క్రమంలో తొలినాళ్లలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు కృష్ణంరాజు, శోభన్‌బాబు. దాంతో ఇద్దరి మధ్య చక్కటి స్నేహ బంధం చిగురించింది. ‘బంగారు తల్లి’, ‘మానవుడు దానవుడు’, ‘జీవనతరంగాలు’ చిత్రాల్లో శోభన్‌బాబుకు విలన్‌గా నటించిన కృష్ణంరాజు.. హీరోగా మారాక ‘ఇద్దరూ ఇద్దరే’, ‘కురుక్షేత్రం’, ‘రామబాణం’, ‘జీవితం’ సినిమాల్లో కలిసి సందడి చేశారు.
కృష్ణుడిగా ఎన్టీఆర్ అంటే ఇష్టం..
కృష్ణంరాజుకు ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ నటసార్వభౌముణ్ని తెరపై కృష్ణుడిగా చూడటమంటే ఆయనకు భలే ఇష్టం. ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్ర షూటింగ్‌లో ఈ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనపై చూపిన ప్రేమ.. ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేవారు కృష్ణంరాజు. ఎన్టీఆర్.. కృష్ణంరాజు కలిసి నటించిన తొలి చిత్రం 1969లో వచ్చిన ‘భలే మాస్టారు’. ఆ తర్వాత ఈ ఇద్దరి నుంచి వచ్చిన మరో చిత్రం ‘బడిపంతులు’. ఆ తర్వాత వీరి కలయికలో ‘మనుషుల్లో దేవుడు’, ‘మంచికి మరోపేరు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘వాడే - వీడు’, ‘సతీ సావిత్రి’ వంటి చిత్రాలొచ్చాయి.
ఇవీ చదవండి:
- కృష్ణంరాజు మొత్తం ఆస్తి విలువ అన్ని కోట్లా?
- టర్కీ నుంచి కృష్ణంరాజుకు బాలయ్య నివాళి.. మూవీటీమ్‌తో కలిసి మౌనం..
- కృష్ణంరాజు పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళి
- పెద్దన్నలా ప్రోత్సహించేవారు.. ఆయన లేని లోటు తీరనిది: చిరంజీవి
- ఎన్టీఆర్‌ను అలా చూడటమంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమట
- ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు అదొక్కటే అసంతృప్తి.. ఆ కల నెరవేరకుండానే...