Aadikeshava Movie Review : చిత్రం: ఆదికేశవ; నటీనటులు: వైష్ణవ్‌తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సుదర్శన్, సుమన్, అపర్ణా దాస్ తనికెళ్ల భరణి. సినిమాటోగ్రఫీ: డడ్లీ; ఎడిటింగ్: నవీన్ నూలి; సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్; కళ: ఎ.ఎస్.ప్రకాశ్; నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య; దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్.రెడ్డి; సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్; విడుదల: 24-11-2023
విభిన్నమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన యంగ్ హీరో వైష్ణవ్‌తేజ్.. ఈసారి పక్కా మాస్ కథతో 'ఆదికేశవ'గా ఎంట్రీ ఇచ్చారు. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా..శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. మరీ ఈ సినిమా ఎలా ఉంది? వైష్ణవ్, శ్రీలీల జోడీ మెప్పించిందా?
స్టోరీ ఏంటంటే : తల్లిచాటు బిడ్డలా గారాబంగా పెరిగిన అబ్బాయి బాలు (వైష్ణవ్ తేజ్). ఫ్రెండ్స్‌తో కలిసి బలాదూర్‌గా తిరుగుతుంటాడు. పేరుకి బలాదూర్ కానీ.. కళ్ల ముందు అన్యాయం జరుగుతుందంటే, ఎంతటివాళ్లనైనా ఎదిరించే తత్వం. చిన్న పిల్లలు, మహిళలంటే అతడికి ఎంతో ప్రేమ. తల్లిదండ్రుల బలవంతం వల్ల ఓ కాస్మొటిక్ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. ఇంటర్వ్యూలోనే కంపెనీ సీఈవో చిత్రావతి (శ్రీలీల)కు బాలు బాగా నచ్చుతాడు. ఆ తర్వాత ఇద్దరూ లవ్‌లో పడతారు.
ఇంతలో రాయలసీమలోని బ్రహ్మ సముద్రం నుంచి ఓ పెద్దాయన వచ్చి బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని, తన అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని..బాలును తనతో పాటు ఊరికి తీసుకెళతాడు. ఇంతకీ ఈ బాలు ఎవరు? అతని కుటుంబం కథేమిటి? బ‌్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఎన్నో అరాచకాలు సాగిస్తున్న పది తలల రావణుడిలాంటి చెంగారెడ్డి (జోజు జార్జ్)ని ఎలా ఢీ కొట్టాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
సినిమా ఎలా ఉందంటే:
Aadikeshava Movie Telugu Review : ఏ హీరోనైనా తమ ఫ్యాన్స్‌కు తమ మాస్ ఇమేజ్ను చూపించాలని కోరుకుంటారు. అలా మాస్ హీరో అనిపించుకోవాలనే ప్రయత్నంలో వీరోచితమైన హీరోయిజం, యాక్షన్ అంశాలున్న కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. ఇక పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన హీరోలైతే తొలి అడుగుల్లోనే ఈ తరహా ప్రయత్నాలు చేస్తూ.. సతమతమవుతూ కనిపిస్తుంటారు. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మాత్రం తన నాలుగో సినిమా 'ఆదికేశవ'తో ఆ ప్రయత్నాన్ని చేశారు.
యాక్షన్, సీమ ఫ్యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ ఇలాంటి అంశాలతో కూడిన స్టోరీ ఇది. ఒకట్రెండు మలుపులు తప్ప స్టోరీలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లాగే ఓ ఫార్ములాతో స్టోరీని చెప్పారు డైరెక్టర్. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ అంశాలతో ఫస్ట్‌హాఫ్ సరదాగా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ టైమ్‌కు ఓ ట్విస్ట్.
సెకెండాఫ్ కథంతా సీమలోని బ్రహ్మ సముద్రంలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతోనే సాగిపోతుంది. ఈ కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, ఊరిలో అరాచకాలు, రాజకీయం తదితర అంశాలున్నా ఏ ఒక్క అంశాన్నీ బలంగా స్పృశించకపోవడం కాస్త మైనస్. హీరో హీరోయిన్ కలవగానే ఓ పాట, విలన్ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్ అన్నట్టే సాగుతుంది తప్ప భావోద్వేగాలతో కట్టిపడేసే సన్నివేశాలు.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తించే అంశాలు పెద్దగా కనిపించవు.
'నువ్వు మా బిడ్డవి కాదు, నీ తల్లిదండ్రులు వేరే' అని పాతికేళ్లు పెంచిన తల్లి చెప్పడం.. ఆ మాట విని వచ్చిన వాళ్లతో హీరో వెళ్లిపోవడం లాంటి సన్నివేశాలేవీ నేచురల్‌గా అనిపించవు. ఇలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉంటాయి. రచనలో బలం లేకపోయినప్పటికీ.. డైరెక్టర్ మేకింగ్‌లో స్పష్టత కనిపిస్తుంది. చెప్పాలనుకున్నది తన సాంకేతిక బృందంతో కలిసి స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చారు.
ఎవరెలా చేశారంటే:
Aadikeshava Movie Cast : ఫస్ట్‌హాఫ్‌లో వైష్ణవ్‌తేజ్.. బాలుగా పక్కింటి కుర్రాడి తరహాలో కనిపిస్తారు. సెకెండాఫ్‌లో మాత్రం రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శిస్తూ కనిపించారు. తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మాస్ కథలోనూ సహజంగా ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. ఇక శ్రీలీల అందంతో కట్టిపడేశారు. పాటల్లో ఆమె తన ప్రతిభని మరోసారి ప్రదర్శించారు. డ్యాన్స్ సన్నివేశాలతోనే ఆమె పాత్ర పరిచయమవుతుంది. వైష్ణవ్‌తేజ్ తల్లిదండ్రులుగా రాధిక, జేపీ కనిపిస్తారు.
జోజు జార్జ్ క్రూరమైన విలన్‌గా కనిపించినప్పటికీ.. ఆ పాత్ర అంతగా ఎఫెక్ట్ చూపించదు. అపర్ణాదాస్, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్ అక్కడక్కడా నవ్వించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. డడ్లీ విజువల్స్ ఆకట్టుకుంటాయి. జీవీ ప్రకాశ్ పాటలు గుర్తు పెట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. మిగతా విభాగాలన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్.రెడ్డి రచనలో బలం లేదు. పాత కథని పాత పద్ధతులతోనే ఆయన చెప్పారు.
- బలాలు
- + వైష్ణవ్, శ్రీలీల జోడీ
- + మలుపులు
- + అక్కడక్కడా హాస్యం
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథ, కథనం
- - కొరవడిన భావోద్వేగాలు
- చివరిగా : 'ఆది కేశవ'.. సాధారణంగా సాగే ఓ యాక్షన్ సినిమా
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!