స్టార్ హీరో అజిత్ కుమార్‌పై అభిమానంతో ఓ ఫ్యాన్ సాహసం చేశాడు. వీపుకు ఈటెలు గుచ్చుకుని గాల్లో విన్యాసాలు చేశాడు. గాల్లో వేలాడుతూ 30 ఫీట్ల కటౌట్‌కు క్రేన్ సాయంతో పూలదండ వేశాడు. అజిత్ కొత్త సినిమా 'తెగింపు' విడుదల సందర్భంగా నెమిలి ప్రాంతానికి చెందిన అజిత్ అనే వ్యక్తి ఈ విధంగా స్టార్ హీరో అజిత్ కుమార్ కటౌట్‌కు దండ వేశాడు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన జరిగింది.
వేడుకల్లో హీరో అజిత్ అభిమాని మృతి..
అజిత్ కుమార్ కొత్త సినిమా విడుదల సెలబ్రేషన్లలో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ ముందు లారీపై డాన్స్లేస్తూ కిందపడి చనిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని రోహిణి థియేటర్లో 'తెగింపు' సినిమా.. అర్ధరాత్రి ఒంటి గంటకు స్పెషల్ షో ప్రదర్శించారు. ఆ సమయంలో అభిమానులు థియేటర్ ముందు సెలెబ్రేషన్స్ నిర్వహించారు. భరత్ కుమార్(19) అనే అభిమాని.. థియేటర్ ముందున్న పూంతమల్లి హైవేపై నెమ్మదిగా కదులుతున్న ఓ లారీపై డాన్స్ చేస్తున్నాడు. అలా చేస్తూనే లారీ నుంచి కిందకు దూకాడు. దీంతో అతడి వెన్నుముక తీవ్రంగా దెబ్బతింది. అనంతరం అతడిని కేఎమ్‌సీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే భరత్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడిని రిచీ స్ట్రీట్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.