Will Smith Oscars 2022: ప్రతిష్ఠాత్మక సినీ వేడుక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు విల్ స్మిత్.. వ్యాఖ్యాత క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మిత్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. దీంతో అతడి అవార్డుపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఉత్తమ నటుడిగా స్మిత్‌కు అందజేసిన ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆస్కార్ వేడుకలో జరిగిన ఘటనపై అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్నందుకు గానూ స్మిత్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించింది. "వ్యక్తిపై భౌతిక దాడికి దిగడం, బెదిరింపు ప్రవర్తనతో కూడిన స్మిత్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఇందుకు గానూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు మొదలుపెట్టాం. ఆయనపై సస్పెన్షన్, బహిష్కరణ లేదా ఇతర ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 18న జరిగే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ఘటనపై స్మిత్ 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది" అని సమావేశం అనంతరం అకాడమీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అంతేగాక, ఘటన తర్వాత స్మిత్‌ను వేడుక నుంచి వెళ్లిపోవాలని కోరగా.. అందుకు అతడు నిరాకరించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా కమెడియన్, వ్యాఖ్యాత క్రిస్ రాక్‌తో పాటు, నామినీలు, అతిథులు, వీక్షకులకు అకాడమీ నేరుగా క్షమాపణలు తెలిపింది. ఒకవేళ స్మిత్‌పై ఆంక్షలు విధిస్తే అతడు ఉత్తమ నటుడి అవార్డును కోల్పోయే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా వ్యాఖ్యాత, కమెడియన్ క్రిస్ రాక్ ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్ రాక్ ఆమెను 'జీ.ఐ.జేన్' చిత్రంలో 'డెమి మూర్' పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్ స్మిత్ నేరుగా వేదికపై వెళ్లికి క్రిస్ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.
అయితే ఈ ఘటనపై వేదికపైనే స్పందించిన స్మిత్ అకాడమీకి, సహచరులకు క్షమాపణలు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ క్రిస్ రాక్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన భార్యపై జోకులు వేయడంతో భరింలేకే అలా ప్రవర్తించానని రాసుకొచ్చారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది.
తర్వాత మాట్లాడుతా: క్రిస్ రాక్
ఈ ఘటన తర్వాత తొలిసారిగా క్రిస్ రాక్ ఓ కామెడీ క్లబ్‌లో పాల్గొనగా అక్కడ ఆయనకు హృదయపూర్వక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా 'చెంపదెబ్బ'పై ఆయన స్పందిస్తూ.. "అప్పుడు ఏం జరిగిందా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. దీనిపై నేను తర్వాత మాట్లాడుతా" అని అన్నారు.
ఇదీ చదవండి: 'రాజమౌళిపై అలక'... ఆలియా భట్ స్పందన ఇదే..