తమిళనాడు, బిహార్‌లలో కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుల నడుమ సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో మొత్తం 67.84 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు డిప్యుటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆరంభంలో కొంత మందకొడిగా సాగినా క్రమంగా పోలింగ్ ఊపందుకుంది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
ఉత్తరప్రదేశ్ | 66.06 |
బిహార్ | 62.28 |
అసోం | 76.22 |
ఛత్తీస్‌గఢ్ | 71.40 |
కర్ణాటక | 67.67 |
తమిళనాడు | 66.36 |
మహారాష్ట్ర | 67.15 |
కశ్మీర్ | 43.4 |
ఒడిశా | 57.97 |
మణిపూర్ | 68.75 |
ప్రముఖులతో ఆరంభం
ఎన్నికల్లో పెద్దసంఖ్యలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పోలింగ్ ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో రజనీకాంత్, కమల్‌హాసన్, శృతిహాసన్, విజయ్, అజిత్ ఓటు వేశారు. కర్ణాటకలో సినీ నటులు ప్రకాశ్‌రాజ్, ఉపేంద్ర, సుదీప్, హీరోయిన్ ప్రణీత పోలింగ్‌లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, నాయకులు ఓటేశారు. కుమారస్వామి, పళనిస్వామి, బిరేన్ సింగ్, నారాయణస్వామి, నిర్మలా సీతారామన్, దేవెగౌడ సహా పలువురు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
యువత... వృద్ధులు
ఓట్ల పండుగలో యువత, వృద్ధులు ఆసక్తి కనబరిచారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌పూర్‌లో పెళ్లి పీటల నుంచి సరాసరి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కొత్త జంట ఓటు హక్కు వినియోగించుకుంది. కర్ణాటకలోనూ ఓ నూతన జంట పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేసింది. మంగళూరులో ఓ మహిళ తన సీమంతం వేడుక నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది. మహారాష్ట్ర బుల్ధానాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను దివ్యాంగుల బృందం నిర్వహించింది.
ఓటరుపై పోలీసుల లాఠీ...
అసోం కరీంగంజ్ లోక్‌సభ పరిధిలో ఈవీఎంల మొరాయింపుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ అధికారి ముందు నిరసన తెలిపారు. వెంటనే ఈవీఎంలు మార్చాలని కోరారు. ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఓటు వేయకుండా తమను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుంటున్నారంటూ ఆందోళనకు దిగారు బంగాల్ ఇస్లామ్పుర్లోని చోప్రా ప్రాంత ఓటర్లు. జాతీయ రహదారిపై బైఠాయించారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిపై లాఠీలు ఝుళిపించారు.
ఐఈడీ పేలుడు...
మావోలు కొరాచా-మాన్పుర్ రహదారిపై ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయమైంది. ఈ ఘటన మినహా మావోయిస్టు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
రిగ్గింగ్ కలకలం...
అసోంలోని కరీమ్గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో జోరుగా రిగ్గింగ్ సాగింది. ఈ ఉదంతాన్ని ఈటీవీ భారత్ కెమెరా బంధించింది. ఒక్కో వ్యక్తి దాదాపు 15 ఓట్లు వేస్తున్నట్టు ఎన్నికల అధికారే అంగీకరించారు.
7 దశల సార్వత్రిక ఎన్నికల్లో రెండోదశ పోలింగ్ ముగిసింది. మూడో దశ పోలింగ్ ఏప్రిల్-23న జరగనుంది. మొత్తం ఏడు దశల ఫలితాలు మే-23న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: భాజపా ఎంపీ జీవీఎల్‌పై 'షూ' దాడి