ఆన్‌లైన్ జూదంపై ఎలాంటి నిఘా లేదు. దీంతో ఇది పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్లా అందుబాటులోకి వస్తోంది. అంతేకాదు ఇంటర్‌నెట్ ఎక్కువ స్పీడ్‌తో తక్కువ ఖర్చుతో లభిస్తోంది. ఫలితంగా మారుమూల గ్రామాల్లోని యువత సైతం అధికంగా ఈ జూదానికి ఆకర్షితులై తీవ్రంగా నష్టపోతున్నారు. పేకాటను కట్టడి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం పేకాట క్లబ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇదే అదనుగా భావించిన కొన్ని సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ ఆన్‌లైన్ ద్వారా జూదాన్ని నిర్వహిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. వీరిలో యువత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఓ వ్యాపారి కొడుకు డిగ్రీ విద్యార్థి. తండ్రికి తెలియకుండా ఆన్‌లైన్‌లో పేకాట (జూదం, రమ్మీ) ఆడటం ప్రారంభించాడు. మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు గెల్చుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆటకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పెట్టి ఆడాడు. తండ్రి వ్యాపారం కోసం దాచి ఉంచమని ఇచ్చిన రూ.5 లక్షలను జూదంలో పోగొట్టుకున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని వారంలో ఇస్తానని చెప్పి తండ్రి స్నేహితుడైన మరో వ్యాపారి దగ్గర రూ.5 లక్షలు అప్పు చేశాడు. వీటిని కూడా రమ్మీ ఆడి పోగొట్టుకున్నాడు. ఎట్టకేలకూ విషయం బహిర్గతమైంది. స్నేహితుని దగ్గర కొడుకు చేసిన అప్పును తీర్చడానికి తండ్రి నానా కష్టాలు పడుతున్నాడు.
వికారాబాద్ పట్టణంలో ఐదారుగురు ఒకే పేకాట యాప్‌కు అనుసంధానమై ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడటానికి అలవాటు పడ్డారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు నెలలో ఒక్కొక్కరు రూ.50 వేలు పోగొట్టుకున్నారు.
ధారూర్ మండలానికి చెందిన ఓ యువకునికి ఆన్‌లైన్‌లో పేకాట వ్యసనంగా మారింది. చరవాణిలో ఆడుతుంటే తెలిసిన వారు ఫోన్ చేయడంతో ఆటకు అంతరాయం కలుగుతోందని కొత్త సెల్‌ఫోన్ కొన్నాడు. దీనిని కేవలం పేకాట ఆడటానికే పరిమితం చేశాడు. ఆన్‌లైన్ రమ్మీ జీవితాల్లోకి చొరబడి ఎలా బానిసలుగా చేస్తోంది, ఎలా ఆర్థికంగా దెబ్బతీస్తోందనడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.
వలలో 20 వేల మంది యువత
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది యువత ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్నట్లు సమాచారం.ఈ ఆటను ప్రోత్సహిస్తున్న సంస్థలు మెయిల్స్ ద్వారా బోనస్, గిఫ్ట్ కూపన్స్ పేరుతో భారీగా వలవేస్తున్నాయి. దీంతో ఈ జూదం ఆడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది.
ఎక్కడ పడితే అక్కడే..
యువత సరదా కోసమని ప్రారంభిస్తున్న ఈ ఆట తర్వాత వ్యసనంగా మారుతోంది. కంప్యూటర్‌లో, చరవాణిల్లో, ఇంట్లో, వసతి భవనాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఆడుకునే వీలుండటంతో వికారాబాద్ జిల్లాలో రోజుకు రూ.50 లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేస్తే దోపిడీకి గురవ్వాల్సిందే..
రకరకాల ప్రకటనలతో మెయిల్స్ రావడంతో వాటిపై క్లిక్ చేస్తూ రమ్మీ ఆటకు యువత ఆకర్షితులవుతున్నారు. గతంలో సంపన్నులు మాత్రమే కాలక్షేపం కోసం ఆడే ఈ ఆట.. డేటా అధికంగా ఇవ్వడంతో సాధారణ, మధ్య తరగతి వాళ్లందరికి చేరింది.
నివారణ మార్గం ఏమిటి
యువత రమ్మీకి బానిసలై వారి జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా వారిపై నిఘా ఉంచి ఫోన్లో ఏం చూస్తున్నారో చెక్ చేస్తూ ఉండాలన్నారు. అవసరమైతే మానసిక వైద్య నిపుణలకు చూపించాలన్నారు.
అప్రమత్తతే మార్గం
ఏ రకమైన జూదం ఆడినా నేరమే అవుతుంది. ఆకర్షణలకు పోయి అంతర్జాలంలో పలువురు రమ్మీ ఆడుతున్నట్లుగా సమాచారం ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలి. పలువురు జూద ప్రియులు రమ్మీ ఆడుతూ డబ్బులు చేతులు కాల్చుకున్నట్లు కూడా సమాచారం ఉంది. దీనిపై దృష్టి సారిస్తాం. తల్లిదండ్రులు సైతం పిల్లల వ్యవహార శైలిని కనిపెట్టి ఉండాలి.
- సంజీవరావు, డీఎస్పీ, వికారాబాద్
- ఇదీ చదవండి : AP CM: జగన్‌పై ఎత్తేసిన కేసులివే..