Drunk and Drive: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆంధ్రకేసరి నగర్‌లోమద్యం తాగిన వాహనదారుడు అర్ధరాత్రి బీభత్సం సృష్టించాడు. గల్లీ రోడ్డులో అతివేగంగా కారు నడుపుతూ.. మత్తు నెత్తికి ఎక్కి.. అపార్ట్‌మెంట్ గోడను ఢీ కొట్టాడు. ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్‌మెంట్లలోకి వెళ్లిపోయారు. లేదంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు యువకులు రోజు ఖాళీగా ఉన్న ప్రాంతానికి వచ్చి మద్యం, గంజాయి సేవిస్తున్నారని స్థానికులు తెలిపారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం రావడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. అందరూ బయటకు వచ్చి చూడగా కారు బోల్తాపడి ఉండటం గమనించి షాక్ అయ్యారు. కాసేపటి క్రితమే అపార్ట్‌మెంట్లలోకి వెళ్లామని.. లేదంటే పరిస్థితి ఏంటని వాపోయారు. కారు నడుపుతున్న యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. తాగి వాహనం నడిపి ప్రమాదం చేశాననే పశ్చాత్తాపం కూడా యువకుడిలో కనిపించలేదు. ఏదో సాహసం చేసిన వాడిలా.. కారు డోర్ తెరిచి జంప్‌చేస్తూ బయటకు దూకాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. రెండు పల్టీలు కొడుతూ వాహనం కింద పడిపోయింది. కారులో ఉన్న యువకులు మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: Accidents in Sangareddy: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి