భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని ఎడుపులగూడెం వద్ద అటవీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. అక్రమంగా టేకుచెట్లను నరికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వారు అదుపులోకి తీసుకున్నారు.
సత్యనారాయణపురానికి చెందిన ఇద్దరు కలప దొంగలు.. సుమారు లక్ష రూపాయల విలువైన టేకుచెట్లను నరికినట్లు గుర్తించారు. వారి నుంచి కలపతో పాటు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు అక్కడ ఉండడం.. వారిని విచారించిన అటవీశాఖ సిబ్బందికి తాము విలేకరులమని తెలపడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కలప దొంగలు ఎవరు? విలేకరులు అని చెబుతున్న వారు అక్కడ ఎందుకు ఉన్నారు. కలప దొంగలను పట్టుకోవడానికి వచ్చారా.. ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలపను టింబర్ డిపోకి తరలించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్ కుమార్