అనారోగ్యంతో ఉన్న భార్య తల్లిగారింటికి వెళ్తే తనతో రావాలని లేదంటే ఆమె వ్యక్తిగత వీడియోలను అందరికీ పంపిస్తానంటూ బెదిరించిన భర్తపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కార్మికనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఏడు నెలల క్రితం మహమూద్ అక్రమ్ పాషాతో వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అతను భార్యను వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. పుట్టింటికి పంపకుండా నిలువరించేవాడని పేర్కొన్నారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఈ నెల 29న భర్త, తల్లితో కలిసి మోతినగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు కొంత విశ్రాంతి అవసరమని సూచించారు.
యువతి తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తానంటూ భర్తను కోరింది. అందుకు అతను అంగీకరించలేదు అయితే యువతి తల్లి ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. అక్రమ్ నేరుగా అత్తగారింటికి వెళ్లి తన భార్యను ఇంటికి పంపాల్సిందిగా బెదిరించాడని వాపోయారు. ఒకవేళ పంపకపోతే తన వద్ద ఉన్న భార్య వ్యక్తిగత వీడియోలను అందరికీ పంపుతానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.
సాయంత్రం 5.30 ప్రాంతంలో అత్తకు... మరో యువతికి సంబంధించిన వ్యక్తిగత వీడియోను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు. అలాగే మీ కుమార్తె వీడియోలను పంపి పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. యువతి తల్లి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్రమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Steroids: సొంత వైద్యం.. ప్రమాదంలో ప్రాణం!