భర్తతో విభేదాల కారణంగా మహిళ పురుగుల మందు తాగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం బేతంపూడి స్టేజీకి చెందిన గుగులోత్ ప్రేమ, గోలియాతండాకు చెందిన వాంకుడోత్ కుమార్లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల నుంచి గొడవలు కారణంగా విభేదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా తన భార్య కాపురానికి వచ్చేలా చూడాలని వాంకుడోత్ కుమార్ టేకులపల్లి పోలీసులను ఆశ్రయించాడు.
ఇదిలా ఉండగా విడాకులు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నాడని భార్యను భర్త కొడుతున్నాడని వివాహిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పలుమార్లు టేకులపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గోలియాతండా సర్పంచ్ భర్త పంచాయితీ కూడా చేశాడని.. అయినా న్యాయం జరగలేదని వివాహిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మూడు రోజుల నుంచి టేకులపల్లి పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదేమిటని అడగడానికి వెళ్లిన ప్రేమను, ఆమె కుటుంబ సభ్యులను దుర్భాషలాడటం జరిగిందని తెలిపారు. ఈ తతంగం జరుగుతున్న నేపథ్యంలో ప్రేమ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
దీనిపై టేకులపల్లి ఎస్సైని వివరణ కోరగా... భార్యభర్తలు విభేదాలతో దూరంగా ఉంటున్నారని... భర్త కొన్ని రోజులుగా తన భార్యను కాపురానికి వచ్చేలా చూడాలని కోరారని ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసుల మృతి.. ఒకరికి గాయాలు