Woman Suicide Attempt At CM Camp Office: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయం సమీపంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తెను కాపాడాలని వేడుకునేందుకు ఆ మహిళ కాకినాడ నుంచి తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చింది. ఇల్లు అమ్ముకోనీయకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ బెదిరిస్తున్నారని స్పందన కార్యక్రమంలో సీఎంవో అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన కార్యాలయ సిబ్బంది.. సీఎంను కలిసేందుకు అనుమతించలేదు. దాంతో ఇక తనకు న్యాయం జరగదని ఆందోళన చెందిన ఆరుద్ర.. మణికట్టుపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆరుద్రను స్థానికులు, పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
"కుమార్తె కోసం ఇల్లు అమ్మి చికిత్స చేద్దామంటే మంత్రి గన్‌మెన్ అడ్డుపడుతున్నారు. గన్‌మెన్ల దౌర్జన్యంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎవరినీ ఇల్లు కొననీయకుండా అడ్డుపడుతున్నారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో రావాలని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి ఎన్ని దిక్కులు పరిగెత్తాలి. ఇంటి సమస్య పరిష్కరిస్తామని సీఎంవో అధికారులు చెప్పారు. మూడున్నరేళ్లుగా ఎదుర్కొన్న వేధింపులపై జవాబివ్వలేదు. చికిత్సకయ్యే ఖర్చులో 20 నుంచి 30 శాతమే ఇస్తామంటున్నారు. చికిత్సకు సాయం చేయక, ఆస్తినీ అమ్ముకోనీయకపోతే ఎలా?. నా కుమార్తెను బతికించుకోవాలంటే రూ.2 కోట్లు ఖర్చవుతుంది".-ఆరుద్ర, బాధిత మహిళ
ఇవీ చదవండి: