Woman Suicide in Hyderabad : ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న యువతి ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నాంపల్లి పోలీసుల కథనం ప్రకారం.. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని జంగంబస్తీలో నివసించే దంపతుల రెండో కుమార్తె(25)కు, మూసాపేట్‌కు చెందిన యువకుడితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురి మతాలు వేరు. ఈ విషయం యువకుడి కుటుంబీకులకు తెలిసి మందలించారు. ఆరు నెలల క్రితం ప్రేమికులిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్‌ఓగా చేరింది. యువకుడి తల్లిదండ్రులు 2021 నవంబర్‌లో తమ మతానికి చెందిన మరో యువతితో తనయుడికి గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించారు.
Woman Suicide at Nampally : ఇటీవల ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. ప్రేమికుడినే వివాహం చేసుకుంటానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని పట్టుబట్టడంతో గత నెలలో యువతి తల్లి గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరికి తమ ఇంట్లోనే వివాహం చేసింది. వీరి పెళ్లిని యువకుడి కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో రాజ్‌భవన్ సమీపంలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఇటీవల యువతి అనారోగ్యానికి గురికావడంతో పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. పెళ్లయ్యాక ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం మంచిది కాదని తల్లిదండ్రులు యువతిని మందలించారు. కానీ, కట్టుకున్న వాడు ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయకపోవడంతో రెండ్రోజులుగా భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ పోట్లాడుకుంటున్నారు. చివరకు తాను మోసపోయానని భావించిన ఆమె బుధవారం మధ్యాహ్నం ఎలుకల మందు తాగింది. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు చూసి అపస్మారకస్థితిలో పడిఉన్న కుమార్తెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఉస్మానియా మార్చురీ వద్ద ఆందోళన : ప్రేమ పేరుతో యువతిని పొట్టనపెట్టుకున్న నిందితుడితో పాటు అతడి కుటుంబసభ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు గురువారం ఉస్మానియా మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. ఓ పార్టీ నేతలు వారికి సంఘీభావం తెలపడంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. నాంపల్లి, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ పోలీసులు బందోబస్తు మధ్య యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, ఆసిఫ్‌నగర్ దేవునికుంట శ్మశానవాటికలో అంత్యక్రియలు చేయించారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది.