ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆల్మూరు మండలంలోని మడికి గ్రామానికి చెందిన శశికిరణ్(32) అనే యువతి, అదే జిల్లాకు చెందిన రావులపేట మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన కొరపాటి లక్ష్మీనారాయణ(30)ల కుటుంబాలు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాయి. శశికిరణ్ హయత్‌నగర్ సమీపంలోని మునుగనూరులో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో నోటరీ కార్యాలయంలో పనిచేస్తుండగా.. లక్ష్మీనారాయణ పంజాగుట్టలో మినరల్ వాటర్ సరఫరా చేస్తుంటాడు.
గుండెపోటుతో తండ్రి మృతి.. గతంలోనే తల్లి మరణం..
శశికిరణ్, లక్ష్మీనారాయణలిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా... ఇరు కుటుంబాల పెద్దలూ వీరి పెళ్లికి అంగీకరించారు. నాలుగు నెలల క్రితమే ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. త్వరలోనే పెళ్లితో ఒకటవుతారనుకుంటుండగా శశికిరణ్ తండ్రి సుబ్బారావు మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఆ యువతి తల్లి గతంలోనే మరణించింది. ఇటీవల ఆ జంట మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన శశికిరణ్..
సోమవారం ఉదయం ఆమెను తన ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి జిల్లా కోర్టుల వద్ద దింపేందుకు లక్ష్మీనారాయణ మునుగనూరు నుంచి వస్తున్నాడు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద వెనుకనుంచి వేగంగా వచ్చిన ఖమ్మం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న యువతి బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. లక్ష్మీనారాయణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ వేంకటేశ్వర్లును ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: MINOR GIRL COMPALINT: 'మా నాన్న తాగొస్తున్నాడు.. అందర్ని కొడుతున్నాడు'