Nigerian arrest with drugs: నారాయణగూడ పీఎస్ పరిధిలోని కింగ్ కోఠిలో మాదక ద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నైజీరియన్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 30గ్రాముల ఎండీఎంఏ, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు మధ్య మండల డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. నైజీరియాకు చెందిన ఒసాగ్వే జేమ్స్ 2013 నుంచి భారత్‌కు పర్యాటక వీసాపై వచ్చిపోతున్నాడు.
108 మందితో వాట్సాప్ గ్రూప్: 2021లో వీసాపై వచ్చి... గడువు తీరినా గోవాలోనే అక్రమంగా నివసించిన్నట్లు డీసీపీ తెలిపారు. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పలువురికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని రాజేష్ చంద్ర వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తుండగా జేమ్స్‌ను గోవా పోలీసులు అరెస్ట్ చేశారని.. మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చినట్లు డీసీపీ తెలిపారు.
గతంలోనూ ఓసారి అరెస్టైతే... నకిలీ ధృవపత్రాలతో మరో పాస్ పోర్టు సృష్టించి భారత్‌కు వచ్చినట్లు డీసీపీ తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని... జేమ్స్ చరవాణిలోని వాట్సాప్ గ్రూపులో 108 మంది ఉన్నట్లు గుర్తించామని డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. వారిని కూడా విచారించనున్నట్లు డీసీపీ చెప్పారు.