Villagers beat two people in Warangal Dist: నగరంలో కొత్త వ్యక్తులు వచ్చినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. అదే పల్లెటూరులో మాత్రం ఆరా తీస్తారు. వారికి అనుమానం వస్తే వెంటనే పోలీసులకు అప్పగిస్తారు. గ్రామాల్లో ఉండే వ్యక్తులు ఎంత ప్రేమగా ఉంటారు, అలానే సమస్య వస్తే కలిసి ఎదుర్కొంటారు. అదే విధంగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మ తండాలో ఇద్దరు వ్యక్తులకు గ్రామస్థులు దేహశుద్ది చేశారు.
గ్రామస్థుల కథనం ప్రకారం.. ఈరోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు తండా వీధులలో అనుమానాస్పదంగా తిరగడంతో.. అది గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకొని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో స్థానికులు గొర్రెపిల్లలను దొంగిలించడానికి వచ్చారని భావించి వారిని తాళ్లతో కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత స్టేషన్‌కు తరలించారు. వీరిపై గతంలో వరంగల్ ఇంతాజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో స్కూటీ దొంగతనం కేసు నమోదు అయినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి వరంగల్ సీసీఎస్కు తరలించారు. ప్రజలు అప్రమత్తతోనే ఉంటే ఇలాంటి దొంగలను సులభంగా పట్టుకోవచ్చని.. పోలీసులు గ్రామస్థులను అభినందించారు.
ఇవీ చదవండి: