కుంటలో దూకి ఆత్మహత్య చేసుకొని ఒకరు... కాపాడేందుకు ప్రయత్నించి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులోని పల్లెవాని కుంటలో ఈ ఘటన జరిగింది. మృతులు కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాస్, ముంబయికి చెందిన రాజులుగా పోలీసులు గుర్తించారు.
వీరిద్దరూ కలిసి ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులోని పల్లెవాని కుంట వద్దకు వెళ్లారు. అక్కడ కుటుంబ విషయాలను చర్చించుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్, రాజుల మధ్య మాటా మాటా పెరిగింది. వియ్యంకుడు రాజు వెంటనే కుంటలో దూకారు. రాజును కాపాడేందుకు శ్రీనివాస్ యత్నించారు. చివరకు ఇద్దరూ మునిగి మృతి చెందారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరి మృతితో వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో ఉద్యమ నేత శ్రీనివాస్ మృతి