కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 మిథైల్ ప్రిడెనిసోలోన్ సోడియం సక్సినేట్, 12 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన దళపతి భువనేశ్వర్ రాజు ఎల్బీనగర్లో నివాసం ఉంటూ సివిల్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తుండేవారని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కన్నెగంటి మానస సనత్ నగర్‌లో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకొని... అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారని వెల్లడించారు.
తక్కువ ధరకు వివిధ మార్గాల్లో రెమ్‌డెసివిర్, మిథైల్ ప్రిడెనిసోలోన్ సోడియం సక్సినేట్ ఇంజక్షన్లను సేకరించి అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇంజక్షన్లు విక్రయించడానికి సికింద్రాబాద్‌లో కారులో శుక్రవారం వేచి ఉన్న సమయంలో టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్లు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విచారణలో ఇంజక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు అంగీకరించారని వెల్లడించారు.
ఇదీ చదవండి: అక్రమంగా దాచిన రూ.1.30 లక్షల మద్యం స్వాధీనం